: శ్మశానంలో వైభవంగా పెళ్లి వేడుక... ఒక్కటైన జంట!

మహారాష్ట్ర జాల్నా జిల్లా పరతూర్‌లో ఓ వివాహ వేడుకకి హాజరుకావడానికి అందరూ శ్మశానంలోకి వెళ్లారు. అక్క‌డ ఒక్క‌టవుతున్న‌ జంట‌ను చూసి అంతా మురిసిపోయారు. బాజా భజంత్రీల న‌డుమ మంజుశ్రీ, ఆకాష్‌ అనే యువ‌తీయువ‌కులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లివేడుక‌ను చూసిన పెద్ద‌లు ఆద‌ర్శ వివాహం అంటూ కితాబు ఇచ్చారు. అవును.. ఓ సందేశాన్ని ఇవ్వ‌డానికే ఇలా ఆ జంట శ్మ‌శానం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. తమ కర్మభూమిని మరవద్దనే సందేశంతో పాటు కట్నకానుకలు, ఆడంబరాలకు దూరంగా ఉండాల‌ని, మూఢనమ్మకాలపై అవ‌గాహ‌న పెంచుకొని వాటిని త‌రిమేయాల‌ని సందేశమివ్వ‌డానికే ఇలా శ్మ‌శానంలో పెళ్లి చేసుకున్నారు. పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన‌ బంధుమిత్రుల స‌మ‌క్షంలో పరతూర్‌లోని వైకుంఠధాం శ్మశానవాటికలో ఈ జంట‌ ఒక్కట‌యింది.

ఆ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించే మసన్‌జోగి (కాటికాపరి) వర్గానికి చెందిన సుభాష్‌ గైక్వాడ్‌ కూతురే పెళ్లి కూత‌ురు మంజుశ్రీ. అదే వర్గానికి చెందిన సాహెబ్‌రావ్‌ కుమారుడు ఆకాష్ పెళ్లి కొడుకు. శ్మశానంలోనే వారి పెళ్లి చేయాలని మంజుశ్రీ, ఆకాష్‌ల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవ‌డంతో మంజుశ్రీ, ఆకాష్‌లు కూడా త‌మ త‌ల్లిదండ్రుల నిర్ణ‌యానికి ఒప్పుకున్నారు. పెళ్లి కూతురు, పెళ్లికొడుకూ ఇద్ద‌రూ ఉన్న‌త చ‌దువులు చ‌దువుకున్నవారే.  వీరి వివాహం కోసం వైకుంఠధామ్‌ శ్మశానవాటికను ప్రత్యేకంగా అలంకరించి, అంత్యక్రియలు నిర్వహించకముందు శవాలను ఉంచే స్థలంలోనే పెళ్లిమండపాన్ని ఏర్పాటు చేసి మ‌రీ పెళ్లి జ‌రిపించారు.

More Telugu News