: మందులోకి చికెన్ తక్కువైందని తన్నుకున్న అటవీశాఖ సిబ్బంది...పరుగులు తీసిన అహోబిలం భక్తులు

మందులోకి చికెన్ తక్కువైందని అటవీశాఖ సిబ్బంది తన్నుకున్న ఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...అహోబిలంలో అటవీశాఖ సిబ్బందికి పార్టీలు చేసుకోవడం సర్వసాధారణమే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం కార్యాలయానికి చేరుకున్న అనంతరం పార్టీ చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు చికెన్, మద్యం తెచ్చుకుని తాగడం మొదలుపెట్టారు. అయితే మద్యం సరిపోదని భావించిన సిబ్బందిలో మదారి అనే వ్యక్తి మద్యం తెచ్చేందుకు వెళ్లాడు. ఇంతలో అక్కడున్నవారు చికెన్, మద్యం ఖాళీ చేశారు.

దీంతో మద్యం తీసుకుని వచ్చిన మదారి....తన చికెన్ ఏమైందంటూ సహచరులను నిలదీశారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగింది. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మదారి వ్యతిరేక వర్గం అక్కడే ఉన్న బడే (కర్ర) ను తీసుకుని అతని తలపై బలంగా కొట్టాడు. దీంతో మదారి కుప్పకూలిపోయాడు. దీంతో మదారి మరణించాడని భావించిన సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ తతంగమంతా సుమారు అర్థగంట పాటు సాగినట్టు తెలుస్తోంది. అంతవరకు బిగ్గరగా దుర్భాషలాడుకుని, ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్న సిబ్బంది అకస్మాత్తుగా తలుపులు తెరుచుకుని పరుగులు తీయడంతో...ఏం జరిగిందో అర్ధం కాని భక్తులు కూడా పరుగందుకున్నారు.

దీనిపై అహోబిలం అటవీశాఖ రేంజ్ అధికారి రామ్ సింగ్ మాట్లాడుతూ, తాను రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నానని, ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. అయితే అహోబిలంలో జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఘటనలో దాడులు జరిగినట్టు తనకు తెలియదని, మద్యం మత్తు ఎక్కువైన ఒక అధికారిని ఆసుపత్రికి తరలించినట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. దాడులు జరిగినట్టు తెలిస్తే...శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News