: ఎయిర్‌టెల్‌ నుంచి 'బాహుబలి' సిమ్‌.. ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ ఆఫర్లు

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో ఎయిర్‌టెల్‌ భాగస్వామ్యమైందని ఆ కంపెనీ తెలుగు రాష్ట్రాల సీఈవో వెంకటేశ్‌ విజయరాఘవన్ తెలిపారు. ఈ రోజు హైద‌రాబాద్‌, బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఆ కంపెనీ బాహుబ‌లి టీమ్‌తో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో హీరో ప్రభాస్‌, దర్శకుడు రాజమౌళి, న‌టి అనుష్క పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ... తాము చేసుకున్న‌ ఒప్పందంలో భాగంగా త్వరలోనే ఎయిర్‌టెల్‌ నుంచి బాహుబలి సిమ్‌ను తీసుకొస్తున్న‌ట్లు తెలిపారు. ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్న‌ట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు రాజమౌళి మాట్లాడుతూ.. తాను త‌న త‌దుప‌రి సినిమా గురించి ఇప్పుడు ఏమీ ఆలోచించ‌డం లేద‌ని అన్నారు. ఆర్కా టీం బాహుబ‌లి సినిమా ప్రచారానికి సోషల్‌మీడియాను వేదికగా చేసుకుందని అన్నారు. తాను కూడా టెలిగ్రామ్‌ ఏప్, వాట్స‌ప్‌ల ద్వారా అభిమానుల‌కు చేరువగా ఉంటున్నాన‌ని చెప్పారు. బాహుబలికి ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారని, వారి కోసం ఈ ఐదు సంవత్సరాల పాటు చోటు చేసుకున్న విశేషాలను, లొకేషన్ల ముచ్చట్లు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నామ‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్రభాస్‌ మాట్లాడుతూ.. త‌న తదుప‌రి సినిమా యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కబోతోందని తెలిపాడు. త‌నను అంద‌రూ త‌న‌ పెళ్లెప్పుడని అడుగుతున్నార‌ని, బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడో ఈనెల 28న తెలుస్తుంది కదా? అలానే త‌న‌ పెళ్లి విషయం కూడా ఏదో ఒక 28న తెలుస్తుందని ప్ర‌భాస్ స‌ర‌దాగా అన్నాడు. 

More Telugu News