: ఇమ్రాన్ ఖాన్ కు నిరాశ... నవాజ్ షరీఫ్ కు సుప్రీంకోర్టులో ఊరట

‘పనామా గేట్‌’ కుంభకోణంలో పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ను పదవీచ్యుతుడిని చేసి ప్రధాని పదవి అధిష్ఠించాలని భావించిన ఇమ్రాన్ ఖాన్ కు నిరాశ ఎందురైంది. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ వేసిన పిటిషన్ ను విచారించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాని నవాజ్ షరీప్ ను పదవీచ్యుతుడిని చేసేంత బలమైన ఆధారాలు లేవని ప్రకటించింది. దీంతో పదవీ గండం నుంచి నవాస్ షరీఫ్ తప్పించుకోగా, ఈ సారి నవాజ్ కు ముప్పతప్పదని భావించిన ఇమ్రాన్ ఖాన్ నిరాశ చెందారు. ఈ కేసును విచారించిన పాక్ అత్యున్నత న్యాయస్థానం...ప్రధాని కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఒక సంయుక్త దర్యాప్తు బృందాన్ని (జిట్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో పాక్ కు చెందిన నిఘా లేదా దర్యాప్తు సంస్థలకు చెందిన ఐదుగురు ప్రతినిధులు ఉండాలని సూచించింది.

రెండు నెలల్లో ఈ బృందం దర్యాప్తు పూర్తి చేసి, న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతే కాకుండా ఈ బృందం ముందు ప్రధాని నవాజ్ షరీఫ్‌ (67), ఆయన ఇద్దరు కుమారులు హసన్‌, హుస్సేన్‌ వ్యక్తిగతంగా హాజరుకావాలని జస్టిస్‌ అసిఫ్‌ సయీద్‌ ఖోస్లా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3-2 మెజారిటీతో తీర్పునిచ్చింది. రెండుసార్లు పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ అవినీతి డబ్బుతో కుమారుల పేరిట విదేశాల్లో పెట్టిన కంపెనీల ద్వారా వివిధ ఆస్తులు కొనుగోలు చేశారని పనామా గేట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

More Telugu News