: 'సీఎంగారి కారు కనిపించడం లేదా? అంటూ ఉరుకులు పరుగులు పెట్టిన యూపీ పోలీసు యంత్రాంగం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కారు కనిపించడం లేదంటూ పోలీసుల వైర్ లెస్ సెట్ లోంచి సందేశం రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టిన ఘటన ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుందేల్ ఖండ్ లోని ముఖ్యపట్టణమైన ఝాన్సీ జిల్లా పర్యటనకు వెళ్లారు. అనంతరం అక్కడి వికాస్‌ భవన్‌ లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్‌ వాహనాలన్నింటినీ పక్కనే ఉన్న సర్క్యూట్‌ హౌస్‌ లో నిలిపారు. కాసేపయ్యాక కాన్వాయ్‌ లోని ఒక కారు కన్పించడం లేదంటూ వైర్‌ లెస్‌ సెట్ నుంచి ఇతర సెట్లకు సమాచారం వచ్చింది.

దీంతో ఏకంగా సీఎం కాన్వాయ్ లో కారు కనబడడం లేదా? అంటూ కంగారుగా దానికోసం గాలింపు చేపట్టారు. అయితే ఆ కారును కేటాయించిన స్థలంలో కాకుండా మరో చోట పార్కింగ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి, అక్కడ పార్కింగ్ కు అనుమతి లేదని చెప్పి, దానిని మరోచోట పార్క్ చేయాలని ఆదేశించి, వేరో చోట పార్క్ చేయించారు. అయితే ఈ విషయం తెలియని డ్రైవర్ ఆక్కడ తాను పార్క్ చేసిన కారు కనిపించకపోవడంతో, సీఎం కారు పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కారు పోయిందంటూ వైర్ లెస్ సెట్ లో అధికారులను అప్రమత్తం చేయడంతో సీఎం కారు పోయిందంటూ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తరువాత విషయం తెలిసి అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. 

More Telugu News