: విద్యార్థులే తన పిల్లలనుకున్న టీచరమ్మ... తన నగలు అమ్మేసి, విద్యార్థులకు సదుపాయాలు కల్పించిన వైనం!

తమిళనాడులోని విల్లుపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి వెళ్లి చూస్తే అది స‌ర్కారీ బ‌డేనా? లేక కార్పోరేట్ పాఠ‌శాలా? అని అంటారు. ఆ పాఠ‌శాల‌లో నల్లబల్లకు బదులు ఇంటరాక్టివ్ స్మార్ట్‌బోర్డు క‌నిపిస్తుంది. త‌ర‌గ‌తి గ‌దిలో రంగురంగుల సౌకర్యవంతమైన ఫర్నీచర్ చూడ‌వ‌చ్చు. మూడ‌వ త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు అన్ని అంశాల‌ను పూస‌గుచ్చిన‌ట్లు వివ‌రించి చెప్పే విధంగా డిజిట‌ల్ క్లాస్‌రూం ఉంటుంది. ఇదంతా ఎవరో ధ‌నవంతులు ఇచ్చిన ఫండ్స్ తో ఏర్పాటు చేసిన స‌దుపాయాలు కావు. ఆ స్కూల్లో ప‌నిచేస్తోన్న ఓ టీచ‌ర్ త‌న న‌గ‌లు అమ్మి మ‌రీ విద్యార్థుల‌కు క‌ల్పించిన సౌక‌ర్యాలు. తాను చేసిన ప‌నితో ఉపాధ్యాయులంటే ఇలా ఉండాలన్న సందేశాన్ని ఇస్తోంది ఆ టీచ‌ర్‌.

ఆ ఉపాధ్యాయురాలి పేరు అన్నపూర్ణ మోహన్. ఎంతో స్ప‌ష్టంగా ఆంగ్లంలో మాట్లాడే ఆమె త‌న‌ విద్యార్థులను కూడా ఇంగ్లిష్ పండితులుగా తీర్చిదిద్దాల‌ని కృషి చేస్తున్నారు. మంచి బోధనకు త‌గ్గ‌ వాతావరణం కల్పించాలనే కోరికతో తన బంగారు ఆభరణాలు అమ్మేసి, పిల్ల‌కు ఈ సదుపాయాలు కల్పించాన‌ని ఆమె చెబుతోంది. తాను క్లాస్‌ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు పిల్లలతో ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడతానని తెలిపారు. మొద‌ట్లో ఇబ్బంది ప‌డ్డ పిల్ల‌లు ఇప్పుడు త‌న‌ ఇంగ్లిష్‌ని అర్థం చేసుకోవ‌డ‌మే కాకుండా వారు కూడా మాట్లాడుతున్నారని అంటున్నారు. బ్రిటిష్ యాసతో కూడిన ఫొనెటిక్స్‌ను వాడుతూ, ఫొనెటిక్ ఆల్ఫాబెట్స్‌ని ఎలా రాయాలి, వాటిని ఎలా పలకాలి? అనే విషయాలను నేర్పిస్తున్నారు. ఆమె కృషిని గుర్తించిన ‘కనింధ ఇధయంగల్’ అనే సంస్థ ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2017 అందించింది.
 

More Telugu News