: తన తండ్రికి కేన్సర్ అంటూ ఫేస్‌బుక్‌ ద్వారా రూ.20 లక్షలు వసూలు చేసిన యువతి!

తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టి, యూజర్ల సెంటిమెంట్‌తో ఆడుకుందో యువ‌తి. ఎన్నో మాయ‌మాట‌లు చెప్పి, త‌న ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ను ఎంత‌గానో సెంటిమెంట్‌లోకి నెట్టేసి వారి నుంచి సుమారు రూ.20 లక్షల వరకు లాగేసింది. చివ‌ర‌కు ఈ విష‌యాన్ని తెలుసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఎట్ట‌కేల‌కు ఆ మాయ‌లేడీని అరెస్టుచేశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన స‌మియా అనే యువతి ఫేస్‌బుక్‌ను ఉప‌యోగించుకుంటూ ఈ మోసానికి పాల్ప‌డింద‌ని పోలీసులు చెప్పారు.

తన తండ్రి క్యాన్సర్‌ వ్యాధితో బాధ‌ప‌డుతూ న‌గ‌రంలోని ఒమేగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడని సమియా పోస్టులు పెట్టింది. తాను ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో ఉన్నాన‌ని చెప్పుకుంది. స‌హృదయంతో సాయం చేయాల‌ని కోరింది. ఈ పోస్ట్‌ను చూసిన విదేశీయులతో పాటు మరికొందరు ఆమె బ్యాంకు ఖాతాలో డ‌బ్బులు వేశారు. ఆమెకు సాయం చేసిన ఓ యువతి స‌మీయాను ప‌రామ‌ర్శించ‌డానికి ఒమేగా ఆస్పత్రికి వెళ్లింది. అప్పుడుగానీ తెలియ‌లేదు.. స‌మీయా చేస్తోన్న మోసం. ఆ ఆసుప‌త్రిలో అస‌లు క్యాన్సర్‌కి చికిత్స పొందుతున్న వారు ఎవ‌రూ లేరని తెలిసింది. స‌మీయా చేస్తోన్న మోసాన్ని గ‌మ‌నించిన ఒమేగా ఆస్పత్రి యాజమాన్యం తమ ఆస్పత్రికి చెడ్డపేరు వ‌స్తోంద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ మాయ‌లేడిని ఎట్ట‌కేల‌కు పోలీసులు ప‌ట్టుకున్నారు.

More Telugu News