: అనంతపురం ప్రజలపై చంద్రబాబు చురకలు... మెత్తగా మొట్టిన ముఖ్యమంత్రి!

అనంతపురం జిల్లా పామిడిలో నీరు - ప్రగతి ఉద్యమ పైలాన్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆపై జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు చురకలంటించారు. "ప్రతి ఒక్క రైతూ ఓ పంట కుంట తవ్వుకుంటే, పంట సంజీవని కింద కష్టాలు తీరుతాయి. కానీ మీలో ఒక స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటంటే, నా పొలంలో ఒక్క సెంటు కూడా పోకూడదు. కానీ నీరు మాత్రం రావాలి. అవునా? కాదా? ఇది దురాశ అవునా? కాదా? ఎందుకు అనంతపురం జిల్లాలో ఎటు చూసినా ఒక్క చెట్టు కూడా ఉండదు? గట్టుపైన కూడా మీరు చెట్టు పెట్టరు. గట్టుపైన చెట్లు పెంచితే, నీడ వచ్చి పంట పోతుందని అసలు చెట్లే పెట్టకుండా మీ జిల్లాను కరవు జిల్లాగా చేశారు. మన చేతుల్లో ఉండే పనులను కూడా చేయట్లేదు" అని మెత్తగా మొట్టారు.

రాష్ట్రంలోనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో పామిడి ఉందని, చెట్లు లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ఉష్ణోగ్రతలను తగ్గించాలంటే, ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 3,41,163 పంట కుంటలను జాతికి అంకితం చేసినట్టు చంద్రబాబు ప్రకటించారు.

More Telugu News