: ఉద్రిక్తత నడుమ పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న మమతా బెనర్జీ

భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఎట్ట‌కేల‌కు ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని ద‌ర్శించుకున్నారు. హిందువులు కూడా గొడ్డుమాంసం తినొచ్చని గ‌తంలో మమత చేసిన‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు.. మ‌మ‌తా బెన‌ర్జీ ఆ ఆల‌యంలో అడుగుపెట్ట‌డానికి వీల్లేద‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, పూరీ జ‌గ‌న్నాథుడిని ద‌ర్శించుకున్న త‌రువాత ఆమె మాట్లాడుతూ... జన్మతాః తాను హిందువునని, అయితే హిందువులను అపఖ్యాతిపాలుచేసే బీజేపీ తరహా హిందూత్వను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని వ్యాఖ్యానించారు.

త‌మ రాష్ట్రీయుల‌కు పూరీ జగన్నాథుడంటే అమితమైన నమ్మకమని మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు త‌మ‌కు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చని, త‌న‌కు మాత్రం జగన్నాథుడిపట్ల విశ్వాసం ఉంద‌ని ఆమె అన్నారు. హిందూ మతం ఎంతో గొప్పదని ఆమె అన్నారు. అందరినీ కలుపుకునే తత్వం హిందూమ‌తంలో ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ఆమె రాక‌ను బీజేపీ యువ మోర్ఛా ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఆమెను ఆలయంలో అడుగుపెట్టనియ్యబోమని నినాదాలు చేశారు. అయితే, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు ఎక్కడికక్క‌డే అరెస్టు చేశారు.

More Telugu News