: వైద్యులు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు జ‌గ‌న్ అప్పుడ‌ప్పుడు ఇలా చేస్తుంటారు: మంత్రి సోమిరెడ్డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ ఈ నెల 26, 27న గుంటూరులో దీక్ష‌కు దిగుతాన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ రోజు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. జగన్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీక్ష‌ల పేరుతో జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తున్నార‌ని అన్నారు. త‌మ పార్టీ కూడా రాష్ట్రంలో ఉంద‌ని తెల‌ప‌డానికే, తమ ఉనికిని చాటుకోవ‌డానికే జ‌గ‌న్ దీక్ష‌లు చేస్తుంటార‌ని సోమిరెడ్డి అన్నారు. త‌మ ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నప్ప‌టికీ జ‌గ‌న్ ఇలా ఎందుకు దీక్ష‌లు చేస్తుంటారో త‌మ‌కు అర్థం కావ‌డం లేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని రైతుల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని సోమిరెడ్డి అన్నారు. ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు ఇవ్వ‌కుండా ఇలా దీక్ష‌ల‌కు దిగ‌డం స‌రికాదని అన్నారు. రాయ‌ల‌సీమ‌కు నీరు అందిస్తున్నందుకు, అక్క‌డి రోడ్లు బాగుప‌డుతున్నందుకు జ‌గ‌న్‌ దీక్షకు దిగుతున్నారా? అని సోమిరెడ్డి చుర‌క‌లంటించారు. అప్పుడ‌ప్పుడు జ‌గ‌న్ ఇలాగే చేస్తుంటారని దానికి కార‌ణం ఉంద‌ని చెప్పారు. నాలుగైదు నెల‌ల‌కొక‌సారి రెండురోజుల పాటు ఓసారి ఉప‌వాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుంద‌ని జ‌గ‌న్‌కి వైద్యులు సూచ‌న‌లు చేశారని, అందుకే జ‌గ‌న్ ఇలా చేస్తుంటారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. వైద్యుల సూచ‌న‌ల ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ జ‌గ‌న్ దీక్ష‌ల పేరుతో రెండు రోజులు ఇలా చేస్తుంటార‌ని అన్నారు.  ఈ నెల 26న‌ ఉద‌యం దీక్ష‌కు కూర్చొని 27 సాయంత్రం దీక్ష విడిస్తే ఆరోగ్యం బాగుంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. త‌మ ప్ర‌భుత్వం చేస్తోన్న కృషి వ‌ల్ల రైతులు ఎన్నో ఇబ్బందుల నుంచి బ‌య‌టప‌డ్డారని అన్నారు. మిర్చి రైతుల‌ను ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా ఆదుకుంటుంద‌ని చెప్పారు.

More Telugu News