: ‘హిజాబ్’ ను తీసేస్తానన్నకూతురికి తండ్రి ఆసక్తికర సమాధానం!

ముస్లిం మహిళలు తమ సంప్రదాయంలో భాగంగా బురఖాతో పాటు తమ ముఖాలు కనిపించకుండా ఉండేందుకు ‘హిజాబ్’ ను ధరిస్తారు. అయితే, తాను ధరించిన హిజాబ్ ను తీసేద్దామనుకుంటున్నానంటూ ఓ ముస్లిం యువతి తన తండ్రిని అడిగితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయమై సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా తండ్రీకూతుళ్ల సంభాషణ సాగింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో నివసించే పదిహేడేళ్ల లామ్యా అల్షేహ్రి తన హిజాబ్ ను తీసేయాలని అనుకుంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 15న తన ట్విట్టర్ ఖాతా ద్వారా తండ్రికి ఓ మెసేజ్ పెట్టింది. ఈ విషయమై వారి మధ్య ట్వీట్ల రూపంలో సాగిన సంభాషణ  .. ‘బాబా, నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను’.... ‘నేను ధరించిన హిజాబ్ ను తీసేయాలని కోరుకుంటున్నా’ అని లామ్యా పేర్కొంది. ఇందుకు స్పందించిన ఆమె తండ్రి...‘స్వీట్ హర్ట్.. అది నేను తీసుకునే నిర్ణయం కాదు... ఎలా చేయాలని నువ్వు కోరుకుంటావో.. ఆ విధంగా చేయి..గో ఎహెడ్. ఏం ఫర్వాలేదు, నీకు నేను అండగా ఉంటాను...’ అని ఆయా ట్వీట్లలో తన కూతురుకి చెప్పారు.

ఈ ట్వీట్లు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి. చివర్లో లామ్యా ఇచ్చిన ట్వీట్ పై నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా, ఆమె తండ్రిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. కొసమెరుపు ఏంటంటే.. తాను ధరించిన హిజాబ్ ను తొలగించాలనే ఉద్దేశం తనకు లేదని లామ్యా చెప్పడం. అంతేకాదు, నెటిజన్లు చేసిన కొన్ని విమర్శలకు ఆమె ఏకీభవించింది కూడా. హిజాబ్ కు సంబంధించి తనకు, తన తండ్రికి మధ్య జరిగిన సంభాషణను పబ్లిక్ లో పెట్టడానికి గల కారణాలను వివరించింది. 

More Telugu News