: చిన్నప్పుడు విడిపోయారు.. 27 ఏళ్ల తరువాత టీవీ కార్యక్రమంలో కలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురైన అక్కాతమ్ముళ్లు

విడిపోయిన 27 ఏళ్ల తరువాత ఓ టీవీ కార్యక్రమంలో కలుసుకున్న అక్కాతమ్ముళ్లు తీవ్ర భావోద్వేగానికి గురైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... 1990లో యాన్యన్‌ అనే రెండేళ్ల బాలుడు రైల్వే స్టేషన్‌ లో తప్పిపోయాడు. దీంతో తప్పిపోయిన కొడుకు కోసం అతని తల్లిదండ్రులు...నాలుగేళ్ల కుమార్తె జియాయును అమ్మమ్మ వద్ద వదిలిపెట్టి వెళ్లి వెతకడం ప్రారంభించారు. కుమారుడి ఆచూకీ కోసం వారు చేయని ప్రయత్నం అంటూ లేదు, తిరగని ప్రదేశం లేదు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన యాన్యన్, జియాయు తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించారు. అనంతరం తల్లిదండ్రులు అసంపూర్తిగా వదిలేసిన బాధ్యతను జియాయు భుజాన వేసుకుంది.

తమ్ముడిని ఎలాగైనా కనిపెట్టాలని భావించింది. దీంతో, జియాయు 2015 లో పబ్లిక్‌ సెక్యురిటీ అఫీషియల్‌ వెబ్‌ సైట్‌ లో తన డీఎన్‌ఏ వివరాలను నమోదు చేసుకుంది. అయితే అక్రమరవాణా ద్వారా తూర్పు చైనాలోని ఓ కుటుంబంతో కలిసి ఉంటున్న యాన్యన్ కూడా తన డీఎన్ఏ వివరాలను పబ్లిక్ సెక్యూరిటీ అఫీషియల్ వెబ్ సైట్ లో నమోదు చేశాడు. చిన్నతనంలో దూరమైన వారిని చైనాలోని సీసీటీవీ ఛానెల్ 'వెయిటింగ్ ఫర్ మీ' అనే కార్యక్రమం ద్వారా కలుపుతుంది. వీరిద్దరి డీఎన్ఏలు కలిసినప్పటికీ అనుమానాలు ఉండడంతో జియాయు తన తల్లిదండ్రుల డీఎన్ఏ వివరాలు సేకరించాలని నిర్ణయించింది.

చైనా సంప్రదాయం ప్రకారం ఒకసారి సమాధి చేసిన వారి శరీరాలను తీయడానికి అంగీకరించరు. దీంతో మరోపోరాటానికి జియాయూ దిగింది. ఈ పోరాటంలో విజయం సాధించి, తన తల్లిదండ్రుల డీఎన్ఏలు సేకరించి, వాటిని కూడా వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసింది. దీంతో తన సోదరుడు తూర్పుచైనాలో ఉన్నాడని గుర్తించి, టీవీ ఛానెల్ ను సంప్రదించింది. తన గతం గురించి విన్న యాన్యన్ కూడా జియాయును కలిసేందుకు ఆసక్తి చూపడంతో 27 ఏళ్ల తరువాత వెయిటింగ్ ఫర్ యూ టీవీ కార్యక్రమంలో కలుసుకున్నారు. తొలిసారి చూసుకున్న వీరిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా జియాయు తన తల్లి.. తమ్ముడి కోసం ‘యాన్యన్‌ నువ్వు ఎక్కడ ఉన్నావ్‌. ఈ అమ్మ మొహాన్ని గుర్తుంచుకో. నిన్ను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నా. ఎప్పుడూ నీ గురించే కలగంటున్నా’ అంటూ డైరీలో రాసుకున్న మాటలను చదివి వినిపించారు. దీంతో అక్కడివారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు తన తమ్ముడ్ని తమ తల్లిదండ్రుల సమాధి వద్దకు తీసుకెళ్లి...అమ్మా సాధించాను..ఇదిగో తమ్ముడు...మీ కొడుకు తిరిగి వచ్చాడు, అని చూపిస్తానని జియాయు తెలిపింది. 

More Telugu News