: వాళ్లిద్దరూ కలిసినా నో ప్రాబ్లం.. నిన్నటి నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా: దినకరన్

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఒక్క రోజులోనే మెత్తబడిపోయారు. వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అయిన దినకరన్ కు... జైల్లో ఉన్న శశికళ కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఓ వైపు ఉప ఎన్నికలో డబ్బులు పంచిన కేసు, మరోపైపు రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చే ప్రయత్నం చేసిన కేసు, ఇంకోవైపు ఫెరా కేసు... ఇలా అన్నివైపుల నుంచి ఇరుక్కుపోయారు దినకరన్. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక పూర్తిగా తగ్గిపోయారాయన.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాల కలయికను తాను వ్యతిరేకించనని స్పష్టం చేశారు. వాస్తవానికి నిన్నటి నుంచే పార్టీ కార్యక్రమాలకు తాను దూరంగా ఉన్నానని చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. తన బలాన్ని నిరూపించుకోవడానికి బల పరీక్ష అవసరం లేదని... తన వల్ల పార్టీ బలహీన పడటం తనకు ఇష్టం లేదని చెప్పారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ తనకు సోదరులే అని తెలిపారు. పార్టీ తీసుకునే అన్ని నిర్ణయాలకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. 

More Telugu News