: భారత సంతతి నేరస్తుడు భద్రేష్ ను పట్టిస్తే రూ. 65 లక్షలు: యూఎస్ ఎఫ్బీఐ

రెండు సంవత్సరాల క్రితం డంకిన్ డోనట్స్ రెస్టారెంట్ కిచన్ లో తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆపై తప్పించుకుని తిరుగుతున్న భారత సంతతి నేరస్తుడు, గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడిన భద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్ (26)ను పట్టిస్తే, లక్ష డాలర్లు (సుమారు 65 లక్షల రూపాయలు) బహుమతిగా ఇస్తామని యూఎస్ ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ప్రకటించింది. భద్రేష్ పేరును టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా, 2015లో ఏప్రిల్ 12న మేరీల్యాండ్ లోని రెస్టారెంటులో హత్య జరుగగా, ఆ మరుసటి రోజు నుంచి భద్రేష్ కోసం గాలిస్తున్నా పోలీసులు అతని జాడను కనుక్కోలేకపోయారు. వీసా గడువు ముగిసిపోయినా, అతను దేశం విడిచి వెళ్లాడన్న సమాచారం తమకు అందలేదని చెబుతూ, అతని ఆచూకీ తెలిస్తే చెప్పాలని కోరుతూ ఎఫ్బీఐ ఓ వీడియోను విడుదల చేసింది.

More Telugu News