: అమిత్ షాతో వేర్వేరుగా సమావేశమైన తంబిదురై, మైత్రేయన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన నేత, లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, వివిధ అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రెండు వర్గాలు కలిసిపోయి తమిళనాడులో అధికారం చేపట్టాలని అమిత్ షా సూచించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకులు’ కూడా తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్ తమిళనాడు రాజకీయాలు అమిత్ షా కనుసన్నల్లో సాగుతాయా? అన్న అనుమానం రేకెత్తుతోంది. ఇద్దరూ కలిసి వస్తే భవిష్యత్తులో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా తాము చెప్పినట్టు నడుచుకుంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఒక మంత్రి పదవితో పాటు రెండు సహాయ మంత్రి పదవులు కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ చెరి సగం స్థానాల్లో పోటీ చేయాలని షరతులు విధించినట్టు తెలుస్తోంది. దీనికి సిద్ధంగా ఉంటే కేంద్రం నుంచి తమిళనాడుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం వారిద్దరూ అమిత్ షా ‘ఆశీర్వాదం’ తీసుకుని బయటకు వచ్చిన తరువాతే రెండు వర్గాల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. కాగా, తమిళనాడులో చాలామంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీతో మైత్రికి వివిధ పార్టీలు ఆసక్తిగా ఉన్నాయని, ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి మురళీధర్‌ రావు అన్నారు.

More Telugu News