: పట్టుబిగిద్దామనుకుంటే పెత్తనం కోల్పోయారు.. శశికళ ఉభయ భ్రష్టత్వం!

శశికళ.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఓ వెలుగు వెలిగిన ‘చిన్నమ్మ’ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ‘అమ్మ’ మరణం తర్వాత పార్టీపై పెత్తనం చెలాయించి చక్రం తిప్పిన శశికళ ప్రధాన కార్యదర్శిగా పార్టీ  పగ్గాలు స్వీకరించి, సీఎం కావాలనుకుని కలలు కన్నారు. కానీ అటు పార్టీపై పట్టు కోల్పోయి, ఇటు సీఎం కాలేక ఉభయ భ్రష్టత్వం చెందారు. నాలుగేళ్ల శిక్షాకాలం ముగిసి జైలు నుంచి విడుదలైన తర్వాత అద్భుతాలు జరిగితే తప్ప ఆమె రాజకీయ జీవితం దాదాపు సమాధి అయినట్టే. ఫలితంగా మన్నార్ గుడి మాఫియా శకం ముగిసినట్టే.
 
1980లలో శశికళతో జయలలితకు పరిచయం ఏర్పడింది. తర్వాత అది విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. శశికళ భర్త నటరాజన్ నుంచి ఆమె సోదరులు, వారి సంతానం, అక్కలు.. ఇలా అందరూ ఒక్కొక్కరుగా జయ పంచన చేరారు. చివరికి జయలలిత ఇంట్లోని పనివారు సైతం మన్నర్‌గుడి నుంచే దిగుమతి అయ్యారు.  అలా జయలలిత ఏర్పడిన పరిచయాన్ని శశికళ సొమ్ము చేసుకున్నారు. జయ తర్వాత నేనే అన్న స్థాయికి ఎదిగారు. ఐఏఎస్, ఐపీఎస్.. ఇలా ఎవరైనా తొలుత శశికళను కలిశాకే జయను కలిసే  స్థాయికి చేరుకున్నారు. వీరి ఆగడాలు శ్రుతి మించడంతో 2011లో జయలలిత వీరందరినీ పార్టీ నుంచి తరిమేశారు. తర్వాత శశికళ క్షమాపణ చెప్పడంతో ఆమెను మాత్రం తిరిగి రానిచ్చారు.

జయ మరణం తర్వాత పార్టీ వ్యవహారాలను తన చెప్పుచేతల్లోకి తీసుకున్న శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా  ప్రమాణం స్వీకారం చేయనున్న తరుణంలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తనకు నమ్మినబంటు అయిన దినకరన్‌కు ఏకంగా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అప్పటి వరకు దినకరన్‌కు పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పుడు ఆయన పదవి కూడా ఊడిపోయింది.  మరోవైపు అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబం బహిష్కరణ దాదాపు ఖాయమైంది. ఫలితంగా అన్నాడీఎంకే శశికళ కుటుంబం ముద్ర పూర్తిగా చెరిగిపోయినట్టే. ఫలితంగా మన్నార్ గుడి మాఫియా ఖేల్ ఖతం అయినట్టే.

More Telugu News