: అమ్మ ఆత్మే శశికళను తొక్కేయించిందా?... తమిళనాడులో ఊపందుకున్న ప్రచారం!

తమిళనాడులో పురచ్చితలైవిగా, అమ్మగా, మాజీ ముఖ్యమంత్రిగా తిరుగులేని స్థానం సంపాదించుకున్న దివంగత జయలలిత తర్వాత రాష్ట్రాన్ని శాసిద్దామని భావించిన చిన్నమ్మ శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. జయలలితలా జైలు నుంచే రాష్ట్రాన్ని కనుసన్నల్లో ఉంచుకుందామని భావించిన శశికళను జయలలిత ఆత్మే తొక్కేసిందని తమిళనాట సరికొత్త కథనాలు ప్రచారంలో ఉన్నాయి. జయలలిత మరణానంతర పరిణామాలన్నింటినీ శశికళ తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టగానే... అమ్మ నమ్మిన బంటు పన్నీరు సెల్వంతో అమ్మ ఆత్మే అన్నిపనులు చేయించిందని పేర్కొంటున్నారు. పార్టీకి శశికళ, దినకరన్, మన్నార్ గుడి మాఫియాను జయలలిత దూరం పెట్టారన్న సంగతి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసని అమ్మ అభిమానులు పేర్కొంటున్నారు.

తనకు స్నేహం చాలని చివరి క్షణం వరకు అంటిపెట్టుకుని ఉన్న శశికళ...జయలలిత దగ్గర నేర్చుకున్న రాజకీయాలను వేగంగా అమలు చేయడం ప్రారంభించారని, దీంతో అమ్మ ఆశయాల పేరు చెప్పుకుని పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రి అవుదామని కలలు కని జైలు నుంచే జయలలితలా రాష్ట్రాన్ని పాలించాలని భావించారని, అయితే ఆమె కూడా ఊహించని విధంగా చివరి క్షణంలో జైలు పాలై, చివరికి పార్టీలో చోటు కూడా కోల్పోయేలా జరిగిందని పేర్కొంటున్నారు. ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్టీ, ప్రజల్లో తమకే మద్దతు, పట్టు ఉందని నిరూపించేలా చేసేందుకు భారీ ఎత్తు డబ్బు పంచారని, దీంతో ఉపఎన్నిక రద్దైందని వారు గుర్తుచేస్తున్నారు.

అలాగే అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులను దక్కించుకునేందుకు పన్నీరు సెల్వంతో పంతానికి పోయి... దినకరన్ ఎన్నికల కమిషన్ అధికారులకు కోట్లాది రూపాయల లంచం ఇవ్వజూపాడని, ఈ రెండు వ్యవహారాలు తమిళ రాజకీయాలను సమూలంగా మార్చేశాయని, శశకళ ఆశలకు గండికొట్టాయని వారు పేర్కొంటున్నారు. దీంతో రెండు వర్గాలుగా ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చేతులు కలపకతప్పని పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు. దీనికి శశికళ కుటుంబాన్ని బహిష్కరిస్తేనే విలీనం జరుగుతుందన్న షరతుతో పన్నీర్ సెల్వం తన పంతం నేరవేర్చుకున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు శశికళ అడుగులకు మడుగులొత్తిన పళనిస్వామి జైలులో ఉన్న ఆమెకు దాసుడిగా ఉండడం కంటే పన్నీరు సెల్వంకు మిత్రుడిగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి తన మాటకు ఎదురులేదన్నట్లు అధికారం అనుభవించిన శశికళ...ఆమె మరణానంతరం కూడా పకడ్బందీగా క్యాంపు నడిపించి తన పట్టు నిరూపించుకుని జేజేలు కొట్టించుకున్నారు. అయితే మారిన సమీకరణాలతో అధికార పీఠం అందుకునే క్షణం వరకు వచ్చిన ఆమె అంధకారంలోకి జారిపోయారు. దీంతో ఈ తతంగం మొత్తాన్ని అమ్మ జయలలిత ఆత్మే చేయించిందని ఆమె అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

More Telugu News