: దినకరన్ ను ఎవరెవరు ఏ విధంగా విమర్శించారో చూడండి

అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పై పలువురు నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల అధికారికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించినట్టు దినకరన్ ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జాతీయ స్థాయి నేతలు సైతం దినకరన్ చర్యలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు.

చాలా తక్కువ సమయంలోనే తమిళనాడు రాజకీయాలను దినకరన్ అథమస్థాయికి దిగజార్చారని బీజేపీ నేత ఎస్ ప్రకాశ్ విమర్శించారు. ఎన్నికల అధికారికి లంచం ఇవ్వజూపాడన్న వార్తను వినగానే తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. ఇప్పుడు తమ తప్పును తెలుసుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

సీపీఐ సీనియర్ నేత డి.రాజా మాట్లాడుతూ, దినకరన్ ను అరెస్ట్ చేసి విచారించాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని అన్నారు.

ఎన్సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ, ఈసీ అధికారికి లంచం ఇవ్వాలనే ఆరోపణలు రుజువైతే దినకరన్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి పనుల వల్ల ప్రజాస్వామ్యం నాశనమవుతుందని చెప్పారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు.

More Telugu News