: రసగుల్లా కోసం గొడవ.. ఆగిపోయిన వివాహం .. వెనుదిరిగిన బంధువులు

రసగుల్లా స‌రిప‌డా వ‌డ్డించ‌లేద‌ని అలిగిన‌ వరుడి కుటుంబీకులు గొడవ పెట్టుకోవడంతో పెళ్లి ర‌ద్దు అయిన ఘ‌ట‌న ఉత్తర ప్రదేశ్‌, ఉన్నావ్‌ జిల్లాలోని కుర్మాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. కుర్మాపూర్‌ గ్రామానికి చెందిన శివ్‌కుమార్‌కి, అదే గ్రామానికి చెందిన కామినితో ఈ నెల 14న పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. అయితే, పెళ్లికి వరుడి తరఫు వారు కాస్త ఆలస్యంగా రావ‌డంతో మొద‌ట విందు, ఆ త‌రువాత పెళ్లి జ‌రిపించాల‌ని నిర్ణయించుకున్నారు. అంద‌రూ విందు భోజ‌నం చేస్తున్నారు. అయితే, వధువు బంధువుకి, వరుడి సోదరుడికి మధ్య రసగుల్ల విషయంలో గొడవ చెల‌రేగింది. వరుడి సోదరుడైన మనోజ్ అనే వ్య‌క్తి తనకి రెండు ర‌స‌గుల్లాలు కావాలని డిమాండ్ చేశాడు.

కానీ, వధువు బంధువులు పెళ్లికి వచ్చిన వారందరికీ ఒకటే రసగుల్ల వడ్డించాలని ముందుగానే చెప్ప‌డంతో.. వ‌ధువు బంధువు ఒక‌టి కంటే ఎక్కువ ర‌స‌గుల్లా వ‌డ్డించ‌డానికి నిరాక‌రించాడు. ఈ గొడ‌వ చెల‌రేగి ఒక‌రిపై ఒక‌రు ప్లేట్లతో పాటు అక్క‌డున్న వ‌స్తువులు విసురుకున్నారు. పెళ్లి వేడుక‌లో తీవ్ర ఘ‌ర్ష‌ణ వాతావ‌రణం ఏర్ప‌డ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. పోలీసులు, పంచాయతీ పెద్దలు ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి పెళ్లి చేసుకోవాల‌ని స‌ముదాయించారు. అంద‌రూ తిరిగి పెళ్లి జరిపించడానికి ఓకే చెప్పుకున్నారు. అయితే, కేవ‌లం రసగుల్లా కోసం తన తండ్రిపై చేయిచేసుకున్నారని పెళ్లి కూతురు మాత్రం పెళ్లికి అంగీక‌రించ‌లేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లికి వ‌చ్చిన వారంతా తాము తెచ్చిన గిఫ్టుల‌ను తిరిగి త‌మ ఇంటికే తీసుకెళ్లారు.

More Telugu News