: నేడు దినకరన్ ను ప్రశ్నించనున్న ఢిల్లీ పోలీసులు... అరెస్టుకు అవకాశం

ఏఐఏడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ ను ఢిల్లీ పోలీసులు విచారణకు పిలిచారు. ఏఐఏడీఎంకే పార్టీ చిహ్నం రెండాకుల గుర్తును జాతీయ ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి చెందిన రెండు వర్గాలు వినియోగించుకోకూడదని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ 'రెండాకుల' గుర్తును దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) కు భారీ మొత్తం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో తమిళనాడులో బ్రోకర్ గా పేరుతెచ్చుకున్న సుఖేష్ చంద్రశేఖరన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అతని నుంచి ఖరీదైన వాచ్, 3 లక్షల విలువ చేసే బూట్లు, ఒక బీఎండబ్ల్యూ కారు, 1.30 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుఖేష్ చంద్రశేఖరన్ చెప్పిన వివరాలతో దినకరన్ 50 కోట్ల రూపాయలతో జాతీయ ఎన్నికల సంఘం అధికారికి పెద్దమొత్తంలో లంచం ఇవ్వజూపాడని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు విచారణకు పిలిచారు. విచారణ అనంతరం దినకరన్ ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అన్నాడీఎంకేకు చిక్కులు తప్పవని తెలుస్తోంది. దీంతో దినకరన్ వ్యవహారంపై ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ పరిణామం శశికళ వర్గానికి పెద్దదెబ్బగా తమిళనాడు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

More Telugu News