: నేనిక జన్మలో ఓటేయను... ఇండియన్ ఆర్మీ నిర్వాకంతో బాధితుడి సంచలన నిర్ణయం

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదన్న సంగతి తెలిసిందే. ఓటు హక్కు వినియోగించుకోవాలి, పోలింగ్ లో పాల్గొనాలని ఎన్నికల సంఘం ప్రతిసారీ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అవగాహన కల్పిస్తుంటుంది. అయితే ఇండియన్ ఆర్మీ నిర్వాకం కారణంగా ఒక యువకుడు తాను జన్మలో ఓటేయనని నిర్ణయం తీసుకున్నాడు. దాని వివరాల్లోకి వెళ్తే... ఫరూఖ్ అహ్మద్ దర్ (26) కశ్మీర్ లోని చిల్ గ్రామంలో తీవాచీలు నేస్తుంటాడు. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో ఓటేసేందుకు తన సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరానని తెలిపాడు. ఓటేసి తిరిగి వస్తున్న సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సైనికులు అతనిని ఆపి... ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగారని చెప్పాడు. తరువాత నువ్వు రాళ్లు విసురుతుంటావు కదా? అంటూ చితకబాది, జీపు ముందు భాగానికి కట్టేసి 20 నుంచి 30 కిలోమీటర్లు తిప్పారని చెప్పాడు.

 తన సోదరుడు వారిని ఎంత బతిమిలాడినా వదల్లేదని, ఎక్కువ మాట్లాడితే అతనిని కూడా జీపు ముందు భాగానికి కట్టేస్తామని హెచ్చరించారని ఆయన తెలిపారు. దీంతో తన సోదరుడు వారి జీపును ద్వికచక్రవాహనంపై అనుసరించాడని తెలిపారు. తాను జీవితంలో ఎన్నడూ రాళ్లు రువ్వలేదని, తాను మర్యాదగా శాలువాల వ్యాపారం చేసుకుని బతుకుతున్నానని అహ్మద్‌ చెప్పారు. కానీ రాళ్లు రువ్వేవారి నుంచి రక్షించుకునేందుకు సైనికులే తనను రక్షణ కవచంలా వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు తన రెండు చేతులు సరిగ్గా పనిచేయడం లేదని, ఇకపై తన వృత్తిని ఎలా కొనసాగించాలో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. ఈ సంఘటనతో తనకు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం పూర్తిగా పోయిందని, ఇక భవిష్యత్తులో ఎన్నడూ ఓటేయనని ఆయన తెలిపారు. 

More Telugu News