: వందల కోట్లలో బయటపడుతున్న అవినీతి తిమింగలం ఆస్తులు

ఏపీలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. తవ్వుతున్న కొద్దీ అస్తులు బయటపడడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన ఆస్తులు వందల కోట్లను మించిపోతుండడంతో వారు ముక్కున వేలేసుకుంటున్నారు. దీని వివరాల్లోకి వెళ్తే... విద్య, సంక్షేమ మౌలిక వసతుల కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఫిర్యాదులపై కదిలిన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీంతో ఆయన అక్రమంగా సంపాదించిన కోట్ల ఆస్తులను గుర్తించారు.

హైదరాబాదులోని డీడీ కాలనీలో కోటి రూపాయల విలువైన ఇల్లును గుర్తించారు. అలాగే 30.49 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. జూబ్లిహిల్స్ లోని 87 లక్షల విలువైన ఫ్లాట్ ను కూడా గుర్తించారు. మహబూబ్ నగర్ లో 34 లక్షల విలువైన పదెకరాల భూమిని గుర్తించారు. ఇవే కాకుండా ఆయన కుమార్తె, కుమారుడు, మనవళ్ల పేరిట కూడా ఆయన పలు ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు, వీటి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే పలు బ్యాంకుల్లో ఉన్న లాకర్లు, ఇతర ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు వెల్లడించారు. 

More Telugu News