: పరాకాష్టకు చేరిన అమెరికా అధికారుల అతి... ఉగ్రవాదివంటూ మూడు నెలల చిన్నారిపై ప్రశ్నల వర్షం!

మూడు నెలల చిన్నారంటే ఎలా ఉంటాడు? ఆకలేస్తే ఏడవడం, కడుపు నింపితే బోసినవ్వులు నవ్వుతూ చుట్టూ చూస్తుండటం, నిద్ర వస్తే పడుకోవడం. అంత చిన్న బిడ్డ ఉగ్రదాడులు చేస్తాడంటే నమ్ముతారా? కానీ అమెరికా ఎంబసీ అధికారులు నమ్మారు. తమ అతి చేష్ఠలకు పరాకాష్టగా, ఆ చిన్నారిని ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారించారు. ఈ ఘటనపై 'ది గార్డియన్', 'ది డైలీ మెయిల్' పత్రికలు ప్రత్యేక కథనాలను ప్రచురించి, అమెరికా అధికారుల వైఖరిని ప్రశ్నించాయి. అసలు ఇంతకీ జరిగింది ఏంటంటే...

తమ మూడు నెలల చిన్నారి హార్వీ కెన్యాన్‌ తో కలిసి, హాలిడే ట్రిప్ కోసం యూకే నుంచి యూఎస్ లోని ఫ్లోరిడా కు వెళ్లేందుకు అతని తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. యూకే నుంచి అమెరికా వెళ్లాలంటే నింపాల్సిన ఓ ఇమ్మిగ్రేషన్‌ ఫామ్‌ ను నింపే సమయంలో కన్యాన్ తాతయ్య పాల్, ఓ చిన్న పొరపాటు చేశాడు. మీరు ఉగ్రకార్యకలాపాల్లో పాలు పంచుకున్నారా? అనే ప్రశ్నకు 'నో' అన్న చోట టిక్ చేయాల్సింది బదులు 'యస్' అన్న బాక్సులో టిక్ చేశాడు. అదే ఆ బిడ్డ పాలిట శాపమైంది.

ఇది పొరపాటున జరిగి వుంటుందన్న కనీస విచక్షణ కూడా చూపని ఇమిగ్రేషన్ అధికారులు, హార్వీకి సమన్లు జారీ చేసి, లండన్‌ లోని దౌత్యకార్యాలయానికి పిలిపించారు. అక్కడ చిన్నారి నవ్వుతూ పడుకుంటే, విచారించే ప్రయత్నం చేశారు. అతని నఖశిఖపర్యంతం పరీక్షించారు. వారు పరీక్షిస్తుంటే, చిన్నారి కనీసం ఏడవను కూడా ఏడవలేదట.

ఈ ఘటనపై హార్వీ తాతయ్య మాట్లాడుతూ, అధికారులు ఇలా చేస్తారని ఊహించలేదని చెప్పారు. మూడు నెలల బిడ్డ హాని చేస్తాడని అధికారులు ఎలా అనుకున్నారని ప్రశ్నించిన ఆయన, ఇమ్మిగ్రేషన్‌ ఫాంలో పొరబాటు జరిగి ఉండొచ్చని వారు ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా ఉగ్రవాది అయినా, ఆ ఫాంలో అవునని ఎవరైనా చెబుతారా? అని అడిగారు. ఈ ఘటనతో ఫ్లోరిడా విమానాన్ని మిస్ చేసుకున్న ఆ కుటుంబం మరో విమానంలో వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై లండన్ లోని అమెరికా ఎంబసీ స్పందించాల్సి వుంది.

More Telugu News