: ఆ వీడియో నేపథ్యంలో... శ్రీనగర్ లో భద్రతా దళాలపై పోలీసుల ఎఫ్ఐఆర్!

గత వారంలో శ్రీనగర్ ఉప ఎన్నికల వేళ, తమపై దాడి జరుపకుండా, ఓ వ్యక్తిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకుపోయిన భద్రతా దళాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వ్యక్తిని జీపుకు కట్టిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయి, విమర్శలకు దారితీయగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కల్పించుకుని ఘటనపై నివేదిక కోరారు. ఈ విషయంలో భద్రతా దళాలపై కిడ్నాప్, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

కాగా, ఈ నెల 9న ఈ ఘటన జరిగింది. పోలింగ్ ఆఫీసర్లను చుట్టుముట్టి రాళ్లదాడికి నిరసనకారులు పాల్పడుతున్న వేళ, వారికి రక్షణ కోసం ఓ స్థానిక యువకుడిని జీపు ముందు భాగానికి కట్టి తీసుకెళ్లారు. ఈ వ్యక్తి బడ్గామ్ జిల్లాకు చెందిన సీతాహరన్ గ్రామా నివాసి ఫరూక్ అహ్మద్ దార్ గా గుర్తించారు. 53 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన జవాన్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. తాను తన చెల్లెలి ఇంటికి వెళుతుంటే, అడ్డగించిన జవాన్లు, తనను బలవంతంగా తీసుకెళ్లి జీపుకు కట్టేశారని, నిరసనకారులతో, రాళ్లు రువ్వే వారితో తనకు సంబంధం లేదని అహ్మద్ విచారణలో పోలీసులకు తెలిపాడు.

More Telugu News