: 'ఎన్నికల్లో గెలిచాను కాబట్టి, అప్పటి కేసులు నాకు వర్తించవు' అంటున్న డొనాల్డ్ ట్రంప్

గత సంవత్సరం అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచి, ప్రచారం చేసుకుంటున్న వేళ, తన మద్దతుదారులను హింసకు పొరిగొల్పాడని డొనాల్డ్ ట్రంప్ పై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, తానిప్పుడు అధ్యక్షుడిగా గెలిచాను కాబట్టి, ఆ కేసులేవీ వర్తించబోవని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముగ్గురు నిరసనకారులు మార్చి 2016లో లూయిస్ విల్లీలో జరిగిన ప్రచార సభలో నినాదాలు చేయగా, వారిని కొట్టి తరిమేయాలని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ ముగ్గురూ కోర్టును ఆశ్రయించగా, తొలుత కేసును స్వీకరించేందుకు ఓ ఫెడరల్ జడ్జి నిరాకరించారు.

తాజాగా, ఇప్పుడు వీడియో సాక్ష్యాలను చూపుతూ మరో కేసును బాధితుడు కోర్టు ముందుకు తీసుకు వచ్చాడు. ట్రంప్ మద్దతుదారుడు అల్విన్ బాంబెర్గర్, నిరసనకారులపై దాడికి పాల్పడ్డారని, ట్రంప్ ఆదేశాలతోనే ఇది జరిగిందని ఆరోపించారు. ఈ దాడిలో 21 సంవత్సరాల కాషియా న్వాన్ గుమా అనే కాలేజీ స్టూడెంట్ ప్లకార్డులతో నిరసన తెలుపగా దాడి జరిగిందని కోర్టుకు తెలిపారు. లాస్ వెగాస్ లో ట్రంప్ మాట్లాడుతూ, నిరసనకారుల వైఖరిని వ్యతిరేకిస్తూ, "అతని ముఖంపై బలంగా కొట్టాలని ఉంది" అని వ్యాఖ్యానించడాన్ని సాక్ష్యంగా చూపారు. కాగా, ఇప్పుడు తన వెనుక నిలిచి, ప్రజలు గెలిపించారు కాబట్టి ఇటువంటి కేసులు ట్రంప్ పై వర్తించవని ఆయన తరఫు న్యాయవాదులు చెబుతుండటం గమనార్హం. ఇక కేసును విచారించాలా? వద్దా? అన్నది కోర్టు నిర్ణయించాల్సి వుంది.

More Telugu News