: మరో కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. కొన్ని పాత‌ విధానాలు మంచివే అయినా ఎవ‌రి మాటా విన‌కుండా కొత్త ప‌ద్ధ‌తుల్ని పాటిస్తున్నారు. అమెరికా అధ్యక్ష భవనాన్ని ఎవరెవెరు సందర్శిస్తున్నారనే విషయాన్ని తాము ఇక నుంచి చెప్పబోమని తాజాగా ట్రంప్‌ చెప్పారు. ఈ విషయాన్ని అమెరికా వైట్‌ హౌస్‌ నిన్న ప్రకటించింది.

గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శ్వేత‌సౌధాన్ని సందర్శించిన వారి వివరాలను స్వచ్ఛందంగా ప్ర‌క‌టించేవారు. అయితే, ఆ విధానాన్ని ఇప్పుడు తాము అమలు చేయాల్సిన అవసరం లేదని ట్రంప్ స‌ర్కార్‌ పేర్కొంది. ఈ నిర్ణ‌యాన్ని జాతీయ భద్రత దృష్ట్యా, స్వేచ్ఛా భంగం కారణంగానే తీసుకున్న‌ట్లు వైట్ హౌస్ ప్ర‌క‌టించింది. అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ వివరాలు ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పింది. లేదంటే డొనాల్డ్‌ ట్రంప్‌ పాలన ఉన్నన్ని రోజులు వెల్లడించకుండా, ఆయన అధికారం వదిలేసిన అనంత‌రం మొత్తం ఎంతమంది వచ్చారు? అనే అంశాల‌ను వివ‌రిస్తామ‌ని చెప్పింది.

More Telugu News