: రెండోవిడత ప్రారంభమైన ‘ఆపరేషన్ క్లీన్ మనీ’.. 60 వేలమందికి నోటీసులు!

అక్రమార్కుల పీచమణుస్తున్న కేంద్రం ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ప్రారంభించింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో భారీగా లావాదేవీలు జరిపినవారిని గుర్తించిన కేంద్రం వారికి ఆన్‌లైన్‌లో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. గతేడాది నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేసి పాత నోట్ల మార్పిడికి గడువు ఇచ్చాక పెద్దమొత్తంలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రత్యక్ష  పన్నుల మండలి (సీబీడీటీ) గుర్తించింది. 1300 మంది అత్యంత అనుమానిత వ్యక్తులతోపాటు 60 వేలమందికిపైగా వ్యక్తులు, సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్టు సీబీడీటీ తెలిపింది. వారందరికీ ఆన్‌లైన్‌లో నోటీసులు పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అనుమానితులెవరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఆపరేషన్ తొలి దశలో స్పందించని వారినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. గతేడాది నవంబరు 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ. 9,334 కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించినట్లు పేర్కొంది. తొలి దశలో రూ.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన 17 లక్షలమందికిపైగా ఖాతాదారులకు ఆదాయపన్ను శాఖ ఇప్పటికే ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్స్ పంపించింది.  

More Telugu News