: కానిస్టేబుల్ ని గడ్డం తీసేసి విధుల్లో చేరమన్న సుప్రీంకోర్టు!

గడ్డం ఇప్పుడు అతని ఉద్యోగానికి అడ్డం అయింది. పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా గడ్డం పెంచడంతో ఉద్యోగం కోల్పోయిన ఓ కానిస్టేబుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అతనికి అక్కడ కూడా చుక్కెదురైంది. ఆ వివరాల్లోకి వెళితే, నిబంధనలకు విరుద్ధంగా గడ్డం పెంచిన మహారాష్ట్ర కానిస్టేబుల్‌ జహీరుద్దీన్ శంషుద్దీన్ బిదాడే‌ను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి  సస్పెండ్ చేశారు. ఆమధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ‘నో బ్రీడ్’ పాలసీ ప్రకారం పోలీసులు గడ్డం పెంచుకోవడం నిషేధం. దీనికి జహీర్ అంగీకరించకపోవడంతో అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

దీంతో గతేడాది అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. నిబంధనలు పాటించాల్సిందేనని హైకోర్టు కూడా తేల్చి చెప్పడంతో బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తాజాగా అక్కడ కూడా అతనికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. ఈ కేసును అత్యవసర విచారణకు తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి ఖేహర్.. కావాలంటే మతపరమైన కాలంలో తప్ప మిగతా సమయాల్లో గడ్డం తీసేసి విధుల్లో చేరాలని సదరు కానిస్టేబుల్ కి సూచించారు. అయితే ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. తాత్కాలికంగా గడ్డం తీయడం కుదరదని జహీర్ విన్నవించుకున్నప్పటికీ, కోర్టు అంగీకరించలేదు.  
 

More Telugu News