: ఇది 'బాంబులకే అమ్మ'... అతిపెద్ద బాంబు గురించిన ఆసక్తికర అంశాలివి!

ఆఫ్గనిస్థాన్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా గురువారం నాడు 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'గా పిలుచుకునే జీబీయూ-43ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ బాంబును అచిన్ జిల్లా నాన్గర్హార్ ప్రావిన్స్ పరిధిలోని ఓ టన్నెల్ కాంప్లెక్స్ పై అమెరికా జారవిడిచింది. ఈ నేపథ్యంలో జీబీయూ-43 గురించిన ఆసక్తికర అంశాలివి.
* ఆక్రోనిమ్ ఆధారిత బాంబు ఇది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ దీన్ని ఎంఓఏబీ (మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్)గా అభివర్ణిస్తుంది.
* పెంటగాన్ వర్గాల ప్రకారం, ఇది అతిపెద్ద అణ్వస్త్ర రహిత బాంబు. దీన్ని యుద్ధంలో తొలిసారిగా వాడారు.
* 9,797 కిలోల బరువు, 20 అడుగుల పొడవు, జీపీఎస్ గైడెడ్ వ్యవస్థ దీనిలో ఉంటాయి.
* పేలిన తరువాత భూమిలోకి 200 అడుగుల వరకూ చొచ్చుకెళుతుంది. కాంక్రీటు నిర్మాణాలైతే, 60 అడుగుల మందమైన కాంక్రీటును నాశనం చేయగలుగుతుంది.
* ఈ బాంబును తొలిసారిగా 2003లో పరీక్షించారు. ఆ సమయంలో 20 మైళ్ల పరిధిలో పుట్టగొడుగు ఆకారంలో దుమ్ము మేఘం ఏర్పడింది.
* ఇప్పుడు దీన్ని లక్హీద్ ఎంసీ-130 రవాణా విమానంలో తీసుకు వచ్చి, సరిగ్గా 7:32 గంటల సమయంలో అమెరికా దీన్ని అఫ్గన్ లో గుర్తించిన ఉగ్రవాద స్థావరంపై జారవిడిచింది.
* అమెరికా, ఆఫ్గన్ సంయుక్త దళాలు చొచ్చుకుపోయేందుకు మార్గం సుగమం చేయడంతో పాటు ఐఎస్ఐఎస్ ఫైటర్ల ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ బాంబును జారవిడిచినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
* కాగా, ఈ బాంబుకన్నా నాలుగు రెట్ల శక్తిమంతమైన బాంబును తయారు చేసి 2007లో పరీక్షించిన రష్యా దానికి 'ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' అని నిక్ నేమ్ పెట్టుకోవడం గమనార్హం.

More Telugu News