: భారీ నిరసనతో పోలీసులకు చుక్కలు చూపించిన తమిళ యువత... ఫ్లై ఓవర్ ను గొలుసులతో కట్టేసిన విద్యార్థులు!

ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఈ రోజు చెన్నైలో పెద్ద ఎత్తున‌ యువ‌త రోడ్లపైకి వ‌చ్చి ఆందోళ‌న తెలప‌డంతో న‌గ‌ర‌వ్యాప్తంగా ఆందోళ‌న చెల‌రేగింది. కొన్ని రోజులుగా త‌మిళ‌నాడు రైతులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలంటూ ఢిల్లీలో నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. వారికి మ‌ద్ద‌తుగా త‌మిళ యువ‌త ఈ ఆందోళ‌నకు దిగారు. ఈ రోజు తెల్ల‌వారు జామునే రోడ్ల మీదకు వచ్చిన విద్యార్థులు చెన్నై నగరంలోని గిండి ప్రాంతంలోని కతిపర గ్రేడ్ సెపరేట్ లో ఫ్లై ఓవర్‌ను ముట్ట‌డించి, పెద్ద గొలుసులతో అన్ని రహదారులను చుట్టేసి తాళం వేశారు.

అక్క‌డి ఫ్లైఓవర్ మీదుగానే చెన్నై ఎయిర్‌పోర్టుకి దారి ఉంటుంది. దీంతో ఆ దారిలో వెళ్లే వాహ‌నాల‌న్నీ నిలిచిపోయాయి. వారిని అదుపు చేయ‌డానికి భారీగా అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు రెండు గంట‌ల‌పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఫ్లై ఓవర్ మీదకు చేరుకుని యువకులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తాము ఊహించని విధంగా విద్యార్థులు ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు దిగ‌డంతో పోలీసులు నానా తంటాలు ప‌డ్డారు. ఈ ఆందోళనకు ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, తమిళ సంఘం నాయకుడు గౌతమన్ మద్దతు తెలిపారు. పోలీసులు ఆయ‌‌న‌ను కూడా అరెస్టు చేశారు

More Telugu News