: తెలంగాణ కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణ‌యాలు ఇవే!

తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం సీఎం కేసీఆర్ తాము తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో ఎన్నో అద్భుత క‌ట్ట‌డాలు ఉన్నాయని, తాము స్టేట్ కొత్త హెరిటేజ్ యాక్టును తీసుకురావ‌డానికి నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు. గ‌తంలో హెరిటేజ్ చ‌ట్టం అసంబ‌ద్ధంగా చేశారని ఆయ‌న తెలిపారు. అలాగే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్ట‌రీని పున‌రుద్ధరించాల‌ని నిర్ణ‌యించామ‌ని అన్నారు. త‌మిళ‌నాడులో 50 శాతానికి మించి రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్నారని, అదే విధంగా తెలంగాణ‌లోనూ తీసుకురావాల‌ని చూస్తున్న‌ట్లు తెలిపారు. తాము మ‌తప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు మాత్రం ఇవ్వ‌డం లేద‌ని, తాము ఇస్తున్న రిజ‌ర్వేష‌న్లు కొత్త‌వి కాద‌ని, తెలంగాణ, ఏపీల్లో బీసీ-ఈ రిజ‌ర్వేష‌న్లు ఇప్ప‌టికే అమలులో వున్నాయని, దాన్నే కొంత శాతం పెంచుతున్నామ‌ని, కొత్త‌గా సృష్టించ‌డం లేద‌ని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్ర‌మంలో అనేక ల‌క్ష‌ల మంది పాల్గొన్న వ‌రంగ‌ల్ లాంటి స‌భ‌లో తాను పాల్గొన్నాన‌ని, తెలంగాణ రాష్ట్ర సామాజిక నేప‌థ్యం గురించి తెలుసుకున్నాన‌ని కేసీఆర్ చెప్పారు. ఏపీ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్ప‌డిన ద‌రిమిలా స‌మీక్ష చేసుకుంటామ‌ని చెప్పారు. బీసీ-ఈ గా ప‌రిగ‌ణించ‌బ‌డుతున్న వారిలో పేదరికం ఎక్కువ‌గా ఉందని చెప్పారు. తాము గిరిజనులు, ముస్లింల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని ఎన్నోసార్లు కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పామ‌ని అన్నారు. ఎన్నిక‌ల ముందు కూడా చెప్పామ‌ని, అందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. ముస్లిం వ‌ర్గాల్లో ఉండే వెనుక‌బాటు త‌నాన్ని గుర్తించి ఇప్ప‌టికే కేర‌ళ‌, ఏపీ, తెలంగాణ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు ఇస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. దాన్నే ఇంకా విస్త‌రించ‌నున్నామ‌ని చెప్పారు.

అయితే, రాజ్యాంగం క‌ల్పించిన వెసులుబాటు ప్ర‌కారం ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వడానికి క‌మిషన్ల‌కు ఈ బాధ్య‌త‌ను అప్ప‌గిస్తే ఆ అంశంపై నిన్న నివేదిక వ‌చ్చింద‌ని కేసీఆర్ అన్నారు. దాన్ని అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ ప్రత్యేక స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ నెల 15న మ‌రోసారి మంత్రివ‌ర్గం స‌మావేశ‌మై ఎస్టీ, బీసీ-ఈ ల‌కు ఎంత శాతం మేర‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌న్న‌ది నిర్ణ‌యిస్తుంద‌ని చెప్పారు. అదే రోజు సాయంత్రం బీఏసీ సమావేశం కూడా ఉంటుందని అన్నారు.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FTelanganaCMO%2Fvideos%2F609901875881335%2F&show_text=0&width=560" width="560" height="315" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>

More Telugu News