: నోరు జారిన ట్రంప్ మీడియా కార్యదర్శి క్షమాపణలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా కార్యదర్శి సియాన్ స్పైసర్ తన వ్యాఖ్యలపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సిరియాలో రసాయనిక దాడిని ఖండిస్తూ, జర్మన్ నియంత హిట్లర్ అరాచకాలు కూడా వాటి ముందు దిగదుడుపే అన్నట్టుగా వ్యాఖ్యానించిన ఆయన, తన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు విచారం వ్యక్తం చేశారు. తాను తప్పు తెలుసుకున్నానని, అసలు హిట్లర్ కి, సిరియా అధ్యక్షుడు అసద్ కు పోలికే లేదని, తాను తప్పుడు ఉదాహరణ ఇచ్చానని ప్రకటించారు. అందుకే క్షమాపణలు చెబుతున్నానని ఆయన తెలిపారు.

తనకు హిట్లర్ డెత్ క్యాంపుల గురించి అవగాహన ఉందని, తాను కేవలం అసద్ రసాయనదాడి గురించే మాట్లాడాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా, సిరియాలో రసాయన దాడి అనంతరం ఆయన మాట్లాడుతూ, బషీర్‌ అసద్‌ అంత ఘోరంగా హిట్లర్‌ కూడా వ్యవహరించలేదని అన్నారు. అసలు హిట్లర్‌ కూడా తన సొంత దేశస్థులను చంపడానికి అసద్‌ వలే గ్యాస్‌ వినియోగించలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో స్పైసర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శల వాన కురిసింది. దీంతో తన తప్పు తెలుసుకున్న స్పైసర్ మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు. హిట్లర్ లక్షలాది మంది యూదులను గ్యాస్ ఛాంబర్లలో బంధించి, హతమార్చిన సంగతి తెలిసిందే. అందులో జర్మన్లు కూడా ఉన్నారని చరిత్ర చెబుతోంది. 

More Telugu News