: కుల్‌భూషణ్‌పై అకారణంగా నిందలు మోపుతారా? మేం కసబ్‌ను అలానే చేశామా?: భారత్

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌‌కు గూఢచర్యం ఆరోపణల కింద పాకిస్థాన్ ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న భారత్.. ఈ సందర్భంగా పాక్ ఉగ్రవాది కసబ్ విషయంలో తాము వ్యవహరించిన తీరును ఉదహరిస్తోంది. లష్కరే ఉగ్రవాది అయిన కసబ్ నవంబరు 2011లో ముంబైలో బీభత్సం సృష్టించిన ఉగ్రమూకలో ఒకడు. సజీవంగా చేతికి చిక్కిన అతడిని అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చట్టబద్ధంగా విచారణ పూర్తి చేసిన తర్వాతే ఉరి తీసినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

న్యాయ సహాయం విషయంలో అతడికి ఎటువంటి  ఆటంకాలు కల్పించలేదని పేర్కొన్నారు. నిర్దోషిగా నిరూపించుకునేందుకు చట్టపరంగా, న్యాయపరంగా అతడికి అన్ని అవకాశాలు కల్పించినట్టు పేర్కొన్నారు. అతడొక్కడి విషయంలోనే కాదని, భారత్‌లో పట్టుబడిన  ఉగ్రవాదులందరి విషయంలో తాము ఇలాగే వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. సాక్ష్యాలు లేకుంటే వదిలిపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే పాక్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ వ్యవహారంలో పాక్ ఆ  పని చేయలేదని ఆరోపించారు. అతడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకున్నా అన్యాయంగా ఉరిశిక్ష విధించిందని ఆరోపించారు. అసలు కుల్‌భూషణ్ జాదవ్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న సరైన కారణాన్ని ఇప్పటి వరకు చెప్పలేదని పేర్కొన్నారు. జాదవ్ ఇరాన్‌లో భారత్ వీసాతో ఉండగా పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు పట్టుకున్నారని ఆరోపించారు.

More Telugu News