: బాబోయ్ శ్రీలత!.. పెళ్లి పేరుతో 50 రోజుల్లో రూ.6.3 లక్షలు గుటుక్కు!

ఆమె పేరు శ్రీలత. ఊరు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి. చదవింది పదో తరగతే. కానీ మోసాలు చేయడంలో ఆమెకు సాటి మరెవరూ లేరు. పెళ్లి పేరుతో 50 రోజుల్లో రూ.6.3 లక్షలు స్వాహా చేసిన విషయం తెలిసిన పోలీసులే అవాక్కయ్యారు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో మ్యాట్రిమోనీని ఆశ్రయించిన శ్రీలత.. సుస్మిత పేరుతో అందమైన మరో యువతి ఫొటోను పెట్టింది. తనకు హైదరాబాద్, బెంగళూరులో కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని ప్రొఫైల్‌లో పేర్కొంది. తండ్రి సింగపూర్‌లో గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడని, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని పేర్కొంది. ఆమె ప్రొఫైల్ నచ్చిన ముగ్గురు వ్యక్తులు శ్రీలతను సంప్రదించారు. తల్లిదండ్రులు అంగీకరిస్తే ఈ మేలో పెళ్లి చేసుకుందామంటూ ముగ్గురికీ వేర్వేరుగా చెప్పింది.

ఇక అప్పటి నుంచి వారితో రోజూ ‘టచ్’లో ఉండేది. బాధితుల్లో ఒకరు కర్ణాటకకు చెందిన వారు కావడంతో అతడితో కన్నడలో మాట్లాడేది. ఆ తర్వాత తన ప్లాన్‌లో భాగంగా ఫలానా రోజున పెళ్లి చూపుల కార్యక్రమంటూ తేదీ కూడా ఫిక్స్ చేసింది. తర్వాత ఒకరోజు బాధితుడికి ఫోన్  చేసి తన పర్స్ పోయిందని, అందులో క్రెడిట్, డెబిట్ కార్డులు, ఫోన్ ఉన్నాయని, తనకు అర్జెంటుగా రూ.30 వేలు అవసరం ఉందని, తన అకౌంట్‌లో వేయాలని కోరింది. మరోసారి సింగపూర్ నుంచి తండ్రి డాలర్లు పంపారని, ప్రస్తుతం మార్చే వీల్లేనందున రూ.50 వేలు పంపిస్తే గంటలోనే తిరిగి ట్రాన్స్‌పర్ చేస్తానంటూ మరోమారు.. ఇలా లక్షల రూపాయలను తన ఖాతాలో వేయించుకుంది. పెళ్లి చూపుల కోసం ముందుగా నిర్ణయించుకున్న తేదీకి ముందురోజు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుంది.

అలాగే ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కూడా ఇలాగే మోసం చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బంగళా, చిత్తూరు జిల్లాలో పెద్ద ఇల్లు ఉందని నమ్మించింది. బెంగళూరులో కూడా ఓ విల్లా ఉందని పేర్కొంది. ఆమె మాటలు నమ్మి పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చిన యువకుడిని నిలువునా ముంచేసింది. తండ్రికి గుండెపోటు వచ్చిందని ఓసారి, సోదరుడు చనిపోయాడని మరోమారు ఇలా దఫదఫాలుగా రూ.1.2 లక్షలను తన ఖాతాలో వేయించుకుంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 20 రోజుల క్రితం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులే అవాక్కయ్యారు.

More Telugu News