: టిట్‌ ఫర్ టాట్.. ప్రయాణికుడిని బలవంతంగా కిందికి దించిన ఎయిర్‌లైన్స్‌ మార్కెట్లో ఢమాల్!

సామర్థ్యానికి మించి టికెట్లు విక్రయించి, ఆపై ప్రయాణికుడిని బలవంతంగా కిందికు దించి విమర్శలు ఎదుర్కొన్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు ‘మార్కెట్’ తగిన శిక్ష విధించింది. దెబ్బకు నేలకు దించింది. విమానంలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండడంతో అత్యవసరంగా లూయిస్‌విల్లే వెళ్లాల్సిన వైద్యుడిని విమాన సిబ్బంది బలవంతంగా కాళ్లు చేతులు పట్టుకుని కిందికి దించేశారు.

వైద్యుడి నోట్లో నుంచి రక్తం కారుతున్నా, కనీస మానవత్వం లేకుండా సిబ్బంది వ్యవహరించారు. తాను వైద్యుడినని, అత్యవసరంగా లూయిస్‌విల్లే వెళ్లాల్సి ఉందని చెబుతున్నా వినిపించుకోకుండా కర్కశంగా వ్యవహరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విమానంలో మరో ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో విమాన సంస్థ దుర్మార్గం బట్టబయలైంది. ఈ నేపథ్యంలో, మంగళవారం నాటి ఇంట్రాట్రేడింగ్‌లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ షేర్లు 3.7 శాతం పడిపోయాయి. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ రూ.5,100 కోట్ల (800 మిలియన్ డాలర్లు)కుపైగా పడిపోయింది.


More Telugu News