: విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి.. తనను గుర్తుపెట్టుకోవాలన్న సీఎం!

ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ మందిరంలో మంగళవారం జ్యోతిరావు పూలే 191వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకోవాలనే తపన ఉన్న నిరుపేద కుటుంబాల యువతీయువకులకు అన్నలా అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ, ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పథకంలో లబ్ధిపొందిన విద్యార్థి తండ్రితోపాటు, గ్రూప్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న యువతతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.

గంగాడ తౌడు అనే వ్యక్తితో మాట్లాడుతూ, మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దానికి ఆయన మాట్లాడుతూ బీటెక్ పూర్తిచేసి కెనడాలో పీజీ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం రూ.10 లక్షలకు గాను ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చిందని, మిగిలిన డబ్బులు త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు చెప్పినట్టు పేర్కొన్నారు.  

అనకాపల్లి సమీపంలోని రాజుపాలేనికి చెందిన రమాదేవి మాట్లాడుతూ బీటెక్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుకున్నానని, ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపింది. కోచింగ్ కోసం తనకు ‘ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ’ పథకం కింద ఆర్థిక సాయం అందించినట్టు పేర్కొంది.

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని ఓ పల్లెటూరుకు చెందిన గౌరీ శంకర్ మాట్లాడుతూ బీటెక్ తరువాత కోచింగ్ కోసం లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్‌లో చేరుతానని ఊహించలేదన్నారు. తనకంత  స్తోమత లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ఎన్టీఆర్ ఉన్నత విద్యాదరణ పథకం కింద అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు.  దీంతో స్పందించిన ముఖ్యమంత్రి ‘‘ఉద్యోగం వచ్చిన తరువాత నన్ను గుర్తుపెట్టుకో గౌరీశంకర్’’ అన్నారు. దీంతో  ‘‘తప్పకుండా  సర్.. మిమ్మల్ని కలిసి మీ ఆశీర్వాదం తీసుకుంటా’’ అని గౌరీశంకర్ బదులిచ్చాడు.

More Telugu News