: 30 ఏళ్లలో 30 శాతం జీవరాశులు అంతరించిపోతాయా?

ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షాలు సకాలంలో కురవడం లేదు. శీతాకాలంలో చలివణికిస్తోంది. వేసవిలో ఎండలు బయటకు అడుగుపెట్టనీయడం లేదు. దీంతో రానున్న ఇరవై, ముప్పై ఏళ్లల్లో 30 శాతం జీవరాశులు నశించిపోయే ప్రమాదముందని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ సంస్థ (ఈఎఫ్‌టీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్, పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి.కల్యాణ చక్రవర్తి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులో  పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహకారంతో సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) నిర్వహించిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, వాతావరణ మార్పులపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడంలో మీడియా కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కేవలం మరో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే కోట్లాది ప్రాణులు మరణిస్తాయని ఆయన తెలిపారు.

 పర్యావరణంలో కలుస్తున్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం యుద్ధప్రాతిపదికన తగ్గకుంటే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా ఇబ్బంది పడతాయని ఆయన హెచ్చరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగి, ప్రపంచ పటంలోని కొన్ని దేశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. అసాధారణ వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయానికి గడ్డుకాలం దాపురించనుందని ఆయన తెలిపారు. సకాలంలో వర్షాలు కురుస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని, వాతావరణ మార్పులు రుతువుల క్రమాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో వ్యవసాయ పంటలు పండించాలని ఆయన సూచించారు. ఈ మేరకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తక్కువనీటితో పంటలు పండించే ప్రయోగాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

More Telugu News