: సినిమా పంపిణీదారులపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

సినిమా పంపిణీదారులను ఉద్దేశించి సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి, కొన్ని నెలలపాటు కష్టపడి తీసిన సినిమాను అమ్ముకోవడానికి నిర్మాతలు గిమ్మిక్కులు చేస్తారని, పంపిణీదారులు వాటిని నమ్మి మోసపోయి చివరికి నష్టం వచ్చిందని అడగడం తప్పని వ్యాఖ్యానించారు. అంచనాలు పెట్టుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడడంతో నష్ట పరిహారం ఇవ్వాలంటూ నటీనటులపై ఒత్తిడి తెస్తున్న వార్తలు ఇటీవల తరచూ వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న ‘నెరుప్పుడా’ ఆడియో వేడుకను సోమవారం చెన్నైలోని శివాజీ గణేశ్ నివాసమైన అన్నై ఇల్లంలో ఘనంగా నిర్వహించారు. రజనీకాంత్ పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాల్ సారథ్యంలో తమిళ సినిమాకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకోవడానికి ఏవేవో గిమ్మిక్కులు చేస్తారని, పంపిణీదారులు వాటిని నమ్మి భారీ ధరకు సినిమాను కొనుక్కుని, చివరికి నష్టం వచ్చిందని అడగడం తప్పని అన్నారు. సినిమాలను అంచనా వేసి కొనుక్కుంటే ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో విశాల్, సత్యరాజ్, ప్రభు, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News