: మొన్న కాళేశ్వరీ ట్రావెల్స్... నిన్న కేశినేని ట్రావెల్స్... రేపు?...ఎందుకు మూతపడుతున్నాయి?... ఓ విశ్లేషణ!

నిన్న మొన్నటి వరకు కాళేశ్వరి ట్రావెల్స్, కేశినేని ట్రావెల్స్ ప్రైవేటు బస్సులు నడపడంలో దిగ్గజాలు. మొన్నామధ్య కాళేశ్వరీ ట్రావెల్స్ బస్సులు నడపలేమని చేతులెత్తేయగా...నిన్న ఎంపీ కేశినేని నాని బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేస్తున్నానని అకస్మాత్తుగా ప్రకటించారు. అయితే ఎంపీ అయిన మూడేళ్లకు కేశినేని నానికి బాధ్యతలు గుర్తుకొచ్చాయా? అని కొందరు ఆశ్చరయం వ్యక్తం చేస్తున్నారు... అయితే వాస్తవానికి కేశినేని నాని ట్రావెల్స్ మూసేయడం వెనుక కారణం బాధ్యత కాదని తెలుస్తోంది... నిన్నమొన్నటి వరకు లాభాల బాటలో నడిచిన మరికొన్ని ప్రైవేటు ట్రావెల్స్ కూడా  వ్యాపారం మూసేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా ఎందుకు? అన్న వివరాల్లోకి వెళ్తే... అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్స్ వ్యాపారం లాభసాటి వ్యాపారం... ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయానికి గండికొట్టి మరీ బలోపేతమయ్యాయి.. ఎలా? అంటే... సువిశాల ఏపీలో ఒక్క బస్సుకు పర్మిట్ తీసుకుని రెండు ప్రాంతాల్లో బస్సులు నడిచేవి... ఒకే నెంబర్ తో రెండు బస్సులు ఉండేవి...ఒకటి హైదారాబాదు నుంచి మరో ప్రాంతానికి బయల్దేరితే...మరో ప్రాంతం నుంచి అదే నెంబర్ గల బస్సు హైదరాబాదు బయల్దేరేదని పేరు చెప్పని ట్రావెల్ సంస్థలు తెలిపాయి. అయితే రాష్ట్ర విభజన ట్రావెల్ సంస్థల జాతకాలను మార్చేసింది. విభజన అనంతరం ప్రైవేటు ట్రావెల్స్ సంక్షోభం అంచుకు చేరుతున్నాయి. ప్రైవేటు ఆపరేటర్‌ కాంట్రాక్టు క్యారియర్‌ పర్మిట్‌ ను కలిగి ఉంటాడు. కాబట్టి మోటార్‌ వాహనాల చట్టం, ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పన్నులు, ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

విభజన తర్వాత వేర్వేరు రాష్ర్టాల్లో ఇంటర్‌ స్టేట్‌ పర్మిట్లు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల్లో పర్మిట్లు, ఫీజులు, పన్నులు చెల్లించాల్సి వచ్చింది. ఇది ప్రైవేటు ట్రావెల్స్ కు ఆర్థికంగా భారంగా మారింది. దీంతో పాటు కాంట్రాక్టు క్యారియర్‌ గా నిబంధనల మేరకు బస్సులోని ప్రతి సీటుకు సీటింగ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. దీని భారం పెరిగిపోయింది. అంతే కాకుండా గత అర దశాబ్ద కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో సేఫ్ ట్రావెల్ గురించి ఆలోచిస్తున్నారు. దీంతో ప్రైవేటు బస్సెక్కేందుకు వెనుకాడుతున్నారు. దీనికి తోడు ప్రైవేటు ఆపరేటర్ల మధ్యన పోటీ మరింత పెరిగింది.

ఇతర రాష్ట్రాలలో పర్మిట్లు తీసుకుని ఇక్కడికి నడుపుతున్నారు. అంతే కాకుండా ప్రైవేటు బస్సులపై నిఘా పెరిగింది. బస్సు ఎక్కడి నుంచి బయల్దేరింది? ఎక్కడికి వెళ్లింది? ఏ నెంబర్ బస్సు వంటి వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటున్నాయి. దీంతో ఒకే నెంబర్ తో ఒకే బస్సును నడపాల్సి వస్తోంది. ఇంతవరకు భారీ ఎత్తున లాభాలార్జించిన ప్రైవేటు ట్రావెల్స్ కు ఈ నిబంధనలు, ఫీజులు చెల్లించేందుకు మనసు ఒప్పడం లేదు. దీంతో సంస్థలను మూసేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చి.... మూసేసుకుంటున్నారు. అలా మూసేసుకుంటూ కొత్త కథలు వినిపిస్తున్నారని తెలుస్తోంది.

More Telugu News