: మద్యం ముట్టుకోమని ప్రమాణం చేయండి.. మన ఊరిని కూడా దత్తత తీసుకుంటాను: మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీ నారాయణ

గ్రామ ప్రజలంతా ప్రమాణం చేస్తే గ్రామాన్నిదత్తత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని వేటపాలెంలో జరిగిన పౌరసన్మానంలో అతిధులుగా హైకోర్టు న్యాయమూర్తులు బాలయోగి, సురేష్ కుమార్ కైట్, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, బురదలో పుట్టిన పుష్పమైనప్పటికీ భక్తుల సాయంతో తామరపుష్పం దేవుని పాదాల చెంతకు చేరుతుందని అన్నారు. పుట్టుక ఏదైనప్పటికీ మనం ఎలా ఉన్నాం, ఏం చేశాం... ఎలా జీవిస్తున్నామన్నదే ముఖ్యమని ఆయన చెప్పారు.

విలువలు లేని జీవితం వ్యర్థమని ఆయన చెప్పారు. విలువలు విద్యతోనే సాధ్యమవుతాయని ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తి మంచి నడవడిక కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తనను చాలా మంది 'మహబూబ్ నగర్ లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు... మన గ్రామాన్నే దత్తత తీసుకోవచ్చుకదా?' అని అడుగుతుంటారని ఆయన తెలిపారు. దానికి తాను చెప్పే సమాధానం ఒకటేనని ఆయన చెప్పారు. ఆ గ్రామంలో ఎవరూ మద్యం ముట్టుకోరని అన్నారు. అలా మీరు కూడా మద్యం ముట్టుకోమని ప్రమాణం చేస్తే... వేటపాలెంను దత్తత తీసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు. 

More Telugu News