: మా కొడుకును కాదని చెప్పేందుకు ధనుష్ మనసు అంగీకరించడం లేదు!: కదిరేశన్ దంపతులు

తమ కొడుకు కాదని చెప్పేందుకు ధనుష్ మనసు అంగీకరించడం లేదని, ఒకవేళ ధనుష్ ఆ మాటను బహిరంగంగా చెబితే తమ పోరాటాన్ని నిలిపివేస్తామని ధనుష్ తమ కొడుకంటూ పోరాడుతున్న కదిరేశన్, మీనాక్షి దంపతులు తెలిపారు. ఓ పత్రికతో మాట్లాడుతూ వారు పలు విషయాలు వెల్లడించారు. తమ చేతులతో అతనికి గోరుముద్దలు తినిపించిన తాము ఈ వయసులో డబ్బుల కోసం దేహీ అంటూ ప్రాధేయపడబోమని తేల్చి చెప్పారు. ధనుష్‌కు చిన్నప్పుడు ఇడ్లీలో నూనె కలిపిన కారంపొడి నంజుకుని తినడం ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ‘‘నేను మీ కొడుకును కాదు. నన్నెందుకు బజారుకీడుస్తున్నారు?’’ అని ధనుష్ ఇప్పటి వరకు ప్రశ్నించలేదని, అలా అడిగేందుకు అతని మనసు ఒప్పుకోకపోవడమే కారణమని కదిరేశన్  దంపతులు అన్నారు.  

తమకు ధనభాగ్యం, కలైసెల్వన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇప్పుడు ధనుష్‌గా ప్రపంచానికి తెలిసినవాడు తమ చిన్న కొడుకు కలైసెల్వన్ అని వివరించారు. మదురైలోని ఓ పెద్దాస్పత్రిలో పుట్టిన కలైసెల్వన్ తన పుట్టింట్లో పెరిగి పెద్దవాడయ్యాడని మీనాక్షి తెలిపారు. మేలూరు ప్రభుత్వ స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాడని పేర్కొన్నారు. తిరుపత్తూరు స్కూల్‌లో ప్లస్‌వన్‌లో చేరిన పది రోజుల తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి అతడి కోసం వెతికామన్నారు. ఓ రోజు ధనుష్ నటించిన ‘పొల్లాదవన్’ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూను టీవీలో చూసిన తర్వాత అతడు తమ కుమారుడిలానే ఉన్నాడని అందరికీ చెప్పి సంతోష పడినట్టు వివరించారు.

ఆ ఇంటర్వ్యూలో ధనుష్ సైతం తనది మదురై అని, ప్లస్‌వన్ తర్వాత అర్థాంతరంగా చదువు మానేసినట్టు చెప్పాడని గుర్తుచేశారు. ధనుష్ తమ కొడుకేనని చెబుతుంటే అందరూ ఎగతాళి చేస్తున్నారని, అందుకే కోర్టును ఆశ్రయించామన్నారు. ‘‘మా నెత్తురు పంచుకుని పుట్టిన బిడ్డ మేమెవరిమో తెలియనట్టు ప్రవర్తిస్తుండడాన్ని భరించలేకపోతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎన్ఏ పరీక్ష చేయిస్తే నిజాలు బయటకు వస్తాయని కదిరేశన్ దంపతులు పేర్కొన్నారు.

More Telugu News