: అభిమానులను అలరించిన కేదార్ జాదవ్... నిరాశపరిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ సీజన్ 10లో భాగంగా ఐదో మ్యాచ్ లో కేదార్ జాదవ్ అభిమానులను అలరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే చుక్కెదురైంది. నిప్పులు చెరిగే బంతులు విసిరిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్ మన్ భరతం పట్టారు. క్రిస్ గేల్ (6), మన్ దీప్ సింగ్ (12), కెప్టెన్ షేన్ వాట్సన్ (24), స్టువర్ట్ బిన్నీ (16), విష్ణు వినోద్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో కేదార్ జాదవ్ జూలు విదిల్చాడు. అన్నీ తానై ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన కేదార్ జాదవ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది.

తర్వాత జహీర్ ఖాన్ బౌలింగ్ లో కేదార్ జాదవ్ అవుట్ కావడంతో బెంగళూరు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టపడింది. పవన్ నేగీ (10) భారీ షాట్లకు యత్నంచినప్పటికీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు. చివరి బంతికి మిల్స్ (0) అవుట్ కావడంతో అబ్దుల్లా (5) నాటౌట్ గా నిలిచాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. బ్యాటింగ్ ముగియగానే కొంత స్టేడియంలో సీట్లు ఖాళీ అయ్యాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లలో మూడు వికెట్లతో మోరిస్ రాణించగా, జహీర్ ఖాన్ రెండు వికెట్లు, కుమ్మిన్స్, నదీం చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. కాసేపట్లో 158 పరుగుల విజయ లక్ష్యంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ప్రారంభించనుంది. 

More Telugu News