: ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు: ఏపీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై తెలంగాణ యువతి ఫిర్యాదు

ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి లోబరుచుకుని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఏపీకి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై తెలంగాణకు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వినయ్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. 2015లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి అతనికి ఆన్ లైన్ లో పరిచయం అయింది. చాటింగ్ తో ప్రారంభమైన వారి స్నేహం ఫోన్లలో ముచ్చట్ల వరకు వెళ్లింది.

ఈ నేపథ్యంలో, ఒకసారి బెంగళూరుకు రావాలంటూ యువతిని వినయ్ కోరాడు. 2016 డిసెంబర్ లో బెంగళూరుకు వెళ్లిన సదరు యువతిని, తన రూమ్ కు తీసుకెళ్లి తన వాంఛను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె తన సొంత ఊరుకు వెళ్లింది. అనంతరం, పెళ్లి చేసుకుంటానని చెప్పి, మళ్లీ బెంగళూరుకు పిలిపించి, తన అక్కాబావల వద్ద ఉంచాడు. ఆమె అక్కడ ఉన్నన్ని రోజులు ఆమెతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. అనంతరం ఆమె మళ్లీ తన స్వగ్రామానికి వెళ్లింది.

ఆ తర్వాత మరో యువతితో పెళ్లికి వినయ్ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి... గత ఫిబ్రవరిలో వినయ్ తల్లిదండ్రులను కలుసుకుని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. అయితే, తన కుమారుడికి రూ. 16 లక్షల కట్నం ఇచ్చే సంబంధం కుదిరిందని... అంత కట్నం ఇస్తే నీతోనే పెళ్లి జరిపిస్తామని వారు చెప్పారు. దీంతో, ఈ విషయం గురించి వినయ్ తో ప్రస్తావిస్తే... బెంగళూరుకు వస్తే మాట్లాడుకుందామని అతను చెప్పాడు.

ఆ తర్వాత బెంగళూరు వెళ్లిన ఆమెకు వినయ్ కనిపించలేదు. అగ్రహారలోని వారి అక్కాబావ ఇంటికి వెళ్తే, అక్కడ తాళం వేసి ఉంది. దీంతో, తాను మోసపోయినట్టు ఆమెకు అర్థం అయింది. వెంటనే అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. వినయ్ కి కఠిన శిక్ష పడేంత వరకు తాను పోరాడుతానని బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పింది.

More Telugu News