: తినే తిండి.. ఆలోచనా విధానం సరిగా లేకనే రోగాలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు

తినే తిండి..ఆలోచించే విధానం సరిగాలేకనే రోగాలు వస్తున్నాయని, అందుకే పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రక్ష పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 54 పట్టణాల్లో 222 సీఎం ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో 30 రకాల పరీక్షలు, మందులు పంపిణీ చేస్తామని అన్నారు. త్వరలో బాల సురక్షా కేంద్రాలూ ఏర్పాటు చేస్తామన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారసత్వ రోగాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సిద్ధాంతాలు ఏవైనా ఫలితాలు రావాలని, పేదల కష్టాలు తీరాలని, పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వైద్య సేవల వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తామని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో ఖరీదైన వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్, బేబీ కిట్ పథకాలు ప్రారంభించామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు మహాప్రస్థానం పథకం, స్వాస్థ పథకం కింద వైద్య విద్యార్థులను గ్రామాలకు పంపిస్తున్నామని, ఆసుపత్రికి రాలేని వారి కోసం మొబైల్ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.

More Telugu News