: జయలలిత భౌతికకాయం బొమ్మ, శవపేటిక‌తో ఆర్కేనగర్ లో ప్రచారం

జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ నియోజ‌క వ‌ర్గంలో ఉప‌ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్న పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారంలో పాల్గొంటున్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డానికి రాజ‌కీయ పార్టీలు చేస్తోన్న ప్ర‌య‌త్నాలకు అడ్డుక‌ట్ట వేసేందుకు ఎన్నిక‌ల సంఘం ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టిన‌ప్ప‌టికీ ఆయా పార్టీలు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలు డ‌బ్బ‌ులు పంచుతూ పట్టుపడుతున్నారు. ఈ క్ర‌మంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనమైంది. ఆర్కేనగర్‌లో సుమారు  రెండు లక్షల ఓటర్లు ఉన్నారు. ఒక్కో ఓటుకు రూ.4వేలు నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి.

అయితే, నోట్లు ఇచ్చినా త‌మ‌కి ఓటు ప‌డుతుందా? అనే అనుమానం వ్య‌క్తం చేస్తోన్న నేత‌లు అమ్మ సెంటిమెంట్‌తో ఓటర్ల‌తో ఆడుకుంటున్నారు. అమ్మ భౌతికకాయం బొమ్మ, శవపేటిక‌తో ప్రచారం చేస్తూ శ‌వ‌రాజ‌కీయాలు చేస్తున్నారు. అమ్మ మరణానికి శశికళ, ఆమె కుటుంబీకులే కారణమని ప‌లువురు ఎన్నో అనుమానాలు వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇదే అదునుగా ఓటర్ల‌ను త‌మ‌వైపుకి తిప్పుకోవ‌డానికి పన్నీర్ సెల్వం వర్గం ఆర్కేనగర్‌లో చిత్రమైన ప్రచారం చేసింది. ఒక జీపుపై అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను శవపేటికలో ఉంచి ప్రచారం నిర్వహించింది. దీనిపై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పలు పార్టీలు ఓటర్లకు గాలం వేసేందుకు ఫ్రిజ్ లు, వాషింగ్ మిషన్ లను పంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.   

More Telugu News