: నంద్యాల టికెట్ కోసం శిల్పా, ఎస్పీవై రెడ్డి, ఫరూక్ ల మధ్య పోటీ... రంగంలోకి దిగిన భూమా బ్రహ్మానందరెడ్డి!

భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ కు జరిగే ఉప ఎన్నికల్లో టికెట్ తమకు ఇవ్వాలంటే, తమకు ఇవ్వాలని తెలుగుదేశంలో వర్గ పోరు ప్రారంభమైంది. ఈ ప్రాంతంలోని పలువురు నేతలు అధిష్ఠానానికి ఇప్పటికే సంకేతాలు పంపడాన్ని మొదలు పెట్టారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం టికెట్ తనకు కావాలని కోరుతూ నేడు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో మరో మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సైతం ఆదివారం తన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. టికెట్ ను ఆశిస్తున్న ఎస్పీవై రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తుండగా, సీటు తమ కుటుంబానిదే కాబట్టి, ఈ అవకాశం తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, భూమా కుటుంబం నుంచి బ్రహ్మానందరెడ్డి రంగంలోకి దిగారు.

ఇదిలావుండగా, తనకు టికెట్ ఇవ్వకుంటే, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. భూమా కుటుంబానికి సీటిస్తే మాత్రం తాను సహకరించేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. తన కార్యకర్తలు ఇదే విషయాన్ని చెబుతున్నారని ఆయన చంద్రబాబు వద్ద చెప్పినట్టు సమాచారం. అయితే, అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన వచ్చిన సంకేతాలు మాత్రం కనిపించలేదు. ఇక నంద్యాలలో ముస్లిం ఓటర్లు గెలుపును ప్రభావితం చేసే సంఖ్యలో ఉండటంతో, తనకు అవకాశం ఇవ్వాలని ఫరూక్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సీటు తనకే వస్తుందన్న నమ్మకంతో బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. భూమా అనుచరులంతా తనవెంటే ఉన్నారన్న సంకేతాలను ఆయన పంపుతున్నారు. ఇక సంప్రదాయం ప్రకారం భూమా కుటుంబానికి టికెట్ ఇస్తే సరేనని, లేకుంటే మాత్రం తనకు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో నంద్యాలలో రాజకీయ వేడి రగులుతూ, తెలుగుదేశం పార్టీలో సెగలు పుట్టిస్తోంది.

More Telugu News