: వారు కన్విన్స్ అయితే... చంద్రబాబుకు మొట్టికాయలు తప్పవు!: జగన్

పార్టీ ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ నేతలతో కలసి గురువారం ఢిల్లీ చేరుకున్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్‌రెడ్డి, వరప్రసాదరావు తదితరులతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీని కలిసి చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వంలోకి తీసుకోవడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఇకనైనా ఇటువంటి వాటిని ఆపాలని, లేకపోతే ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటివే జరుగుతాయని అన్నారు. మంత్రులు ఏ పార్టీకి చెందినవారో ఎవరికీ అర్థం కాకుండా పోతుందన్నారు. తమ ఫిర్యాదుపై ప్రణబ్ సానుకూలంగా స్పందించారన్నారు.

అలాగే, ముఖ్యమైన బీజేపీ నేతలను కలుస్తానని, వీలైనంత ఎక్కువమంది అపాయింట్‌మెంట్లు కోరి చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వారు కనుక కన్విన్స్ అయితే చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తారని, అప్పుడు స్పీకర్ కోడెల ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని అన్నారు. చంద్రబాబు అవినీతి అన్ని రంగాలకు పాకిందని, గుడిలో లింగాన్ని కూడా వదలడం లేదని ఆరోపించారు. ఫిరాయింపుల వ్యవస్థను మార్చకపోతే వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తనపైనా తన ప్రభుత్వంపైనా నమ్మకం లేకపోవడం వల్లే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లలేకపోతున్నారని ధ్వజమెత్తారు.

More Telugu News