: మంత్రి పదవులు రాలేదని రాజీనామాలు చేశారు.. మరి రైల్వేజోన్, ప్ర‌త్యేక హోదా కోసం ఎందుకు చేయలేదు?: రోజా

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రులపై ప్ర‌తిప‌క్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. వారు ప‌ద‌వుల కోస‌మే పాకులాడుతున్నార‌ని ఆమె అన్నారు. ఏపీ ప్ర‌జ‌ల కోసం వారు రాజీనామా చేసి పోరాడ‌లేరా? అని ప్ర‌శ్నించారు. విశాఖకు రైల్వే జోన్‌ కోసం త‌మ పార్టీ విశాఖ‌ప‌ట్నం అధ్య‌క్షుడు గుడివాడ అమర్ నాథ్‌ చేపట్టిన పాదయాత్రలో ఈ రోజు రోజా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు పౌరుషం ఏమైందని ఆమె నిల‌దీశారు. ప్ర‌ధాని మోదీ మంత్రివ‌ర్గంలో ఆయ‌న ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. నేత‌ల‌కు ప్రజల ఆకాంక్ష తెలుసుకొని పోరాడ‌డ‌మే ముఖ్య‌మ‌ని, ప‌ద‌వులు కాద‌ని ఆమె హిత‌వు ప‌లికారు. కేంద్రం ప్ర‌భుత్వంలో భాగస్వామ్యంగా ఉంటూ పదవులు పొందటంవల్లే కేంద్రాన్ని రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై నిలదీయలేకపోతున్నారని అన్నారు.

విశాఖ‌ప‌ట్నానికి చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు పేపర్ల లీక్‌, మరోమంత్రి నారాయణకు ర్యాంకులపై ఉన్న శ్రద్ధ రైల్వేజోన్‌, ప్రత్యేక హోదాల‌పై లేద‌ని రోజా విమ‌ర్శించారు. బ్యాంకు రుణాల కేసులో బయటపడేందుకు గంటాకు కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకునేందుకే స‌మ‌యం స‌రిపోతుంద‌ని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రి పదవులు రాలేదని టీడీపీ నేతలు రాజీనామాలు చేశారని, ఏపీకి రైల్వేజోన్, ప్ర‌త్యేక హోదా అంశాల్లో మాత్రం వారు రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డ‌లేర‌ని అన్నారు. బీసీలు, మ‌హిళ‌ల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వివ‌క్ష చూపుతూ ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిన పీతల సుజాతను మంత్రి పదవి నుంచి తొలగించారని, మ‌రోవైపు చివ‌రి ర్యాంకు వ‌చ్చిన నారాయ‌ణ‌కు మాత్రం అద‌న‌పు శాఖ‌ ఇచ్చార‌ని అన్నారు.

More Telugu News