: తెలంగాణలో జోనల్ వ్యవస్థ రద్దు.. సిద్ధమవుతున్న రాష్ట్రపతి ఉత్తర్వులు!

తెలంగాణలో త్వరలో జోనల్ వ్యవస్థ రద్దు కానుంది. ఇందుకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరగడంతో జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్రపతితో కొత్త ఉత్తర్వులు జారీ చేయించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఉత్తర్వులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది కావడంతో టీఆర్ఎస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమై ప్రాథమిక ముసాయిదా రూపొందించింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థ ప్రకారం.. విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఒకటి, ఉద్యోగ నియామకాల కోసం మరొకటి చొప్పున రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో పాత ఉత్తర్వులకు సవరణలు తేవడం కంటే కొత్తగా ఉత్తర్వులు జారీ చేయించడమే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర్వుల్లో ఏమేమి ఉండాలో రాష్ట్రప్రభుత్వమే ముసాయిదా రూపొందించి పంపాలని నిర్ణయించింది. రాష్ట్రం వరకు జోనల్ వ్యవస్థను రద్దుచేసి రాష్ట్ర కేడర్లను మాత్రమే ఉంచాలని సర్కారు ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం సర్వీసులో కొనసాగుతున్నవారు పాత నిబంధనల ప్రకారం పనిచేస్తారు. కొత్తగా నియమితులయ్యే వారు మాత్రం కొత్త  ఉత్తర్వుల పరిధిలోకి వస్తారు. కేంద్ర కేబినెట్ ఆమోదంతో తర్వాత దానిని రాష్ట్రపతి తన ఉత్తర్వులుగా వెలువరిస్తారు.

More Telugu News