: ఈ డబ్బులేం సరిపోతాయి ... కనీసం రూ. 5 కోట్లివ్వండి!: విరాట్ కోహ్లీ డిమాండ్

గత నెలలో క్రికెట్ ఆటగాళ్ల వేతనాలను రెట్టింపు చేస్తూ, మూడు విభాగాల్లో ఆటగాళ్లను వర్గీకరిస్తూ, రూ. 2 కోట్లు, రూ. 1 కోటి, రూ. 50 లక్షలు ఇచ్చేలా బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లీ విమర్శించాడు. విదేశీ ఆటగాళ్లు పొందుతున్న ఫీజులతో పోలిస్తే, ఇది చాలా తక్కువని, తమకు అసంతృప్తి ఉందని అన్నాడు. టెస్టు మ్యాచ్ కి రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ-20కి రూ. 3 లక్షలు ఇచ్చేలా పాత ఫీజులను పెంచుతూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయమూ తృప్తిగా లేదని అన్నాడు.

రెండు రోజుల క్రితం భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి మాట్లాడుతూ, ఆటగాళ్లకు వేరుసెనగ పప్పులు ఇచ్చినట్టు బీసీసీఐ వేతనాలు ఇస్తోందని విమర్శించిన మరుసటి రోజే, ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా క్రికెటర్లు సాలీనా రూ. 10 నుంచి రూ. 12 కోట్లు సంపాదిస్తున్నారని, ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో పోలిస్తే, బలంగా ఉన్న బీసీసీఐ, అందులో సగం కూడా ఇవ్వడం లేదని వాపోయాడు. ఏ గ్రేడ్ ఆటగాడికి రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ లో రూ. 3 కోట్లు, సీ గ్రేడ్ లో రూ. 1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కోహ్లీ అభిప్రాయాలతో కోచ్ అనిల్ కుంబ్లే సైతం ఏకీభవించడం గమనార్హం.

More Telugu News